15 రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:06 AM
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు
పెద్దపల్లి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రానున్న పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకు వస్తామని ఆయన చెప్పారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం పెద్దపల్లికి వచ్చిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. మార్చి నెలాఖరు వరకు తీసుకోవాల్సిన రుణాలను ముందుగానే తీసుకున్నారని, అన్ని శాఖల శ్వేతపత్రాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షల వరకు విస్తరించి ఉచిత వైద్యం అందిస్తున్నామని శ్రీధర్‌బాబు చెప్పారు.