నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి

ABN , First Publish Date - 2023-06-26T03:44:25+05:30 IST

విద్యుత్‌ విభాగం నిర్లక్ష్యంతో సూర్యాపేట జిల్లాలో ఓ రైతు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు....

నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి

వేలాడే విద్యుత్‌ తీగలు తగిలి పొలంలోనే రైతు మృతి

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో ఘటన

ఇంటి దగ్గర టెలిఫోన్‌ స్తంభం పట్టుకుని యువకుడి మృతి

టెలిఫోన్‌ స్తంభానికే విద్యుత్‌ తీగలు

శంషాబాద్‌ మండలంలో ఘటన

మేళ్లచెర్వు, శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 25: విద్యుత్‌ విభాగం నిర్లక్ష్యంతో సూర్యాపేట జిల్లాలో ఓ రైతు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలోని శివబాలాజీనగర్‌ తండాలో పొలంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ సురే్‌షయాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం శివబాలాజీనగర్‌ తండాకు చెందిన బానోతు చంద్రియా(65) ఆదివారం తన పొలంలో నారుమడిని శుభ్రం చేస్తుండగా కిందకి వేలాడుతున్న తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత సమీపంలో ఉన్న రైతులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. చంద్రియా భార్య మోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తండాలోని పొలాల్లో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం జూకల్‌ గ్రామానికి చెందిన కార్మికుడు కేశంపేట నరేష్‌(28) ఆదివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉన్న టెలిఫోన్‌ స్తంభాన్ని పట్టుకున్నాడు. వర్షాలకు దానికి విద్యుత్‌ సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ, విద్యుత్‌ అధికారులు వెంటనే టెలిఫోన్‌ ఇనుప స్తంభాన్ని మార్చి సిమెంట్‌ స్తంభం ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-06-26T03:44:25+05:30 IST