Share News

TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన

ABN , First Publish Date - 2023-12-13T03:41:11+05:30 IST

ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ)ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన

యూపీఎస్సీ, ఇతర రాష్ట్ర కమిషన్లపై అధ్యయనం చేయండి

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా

చైర్మన్‌, సభ్యుల నియామకాలు ఉండాలి

పది, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి

ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల పనితీరుపై నివేదిక ఇవ్వండి

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌ ఆదేశం

కొత్త కమిషన్‌ ఏర్పాటు, చైర్మన్‌ నియామకంపై ఆరా

గ్రూప్‌-1, ఏఈఈ పేపర్‌ లీక్‌లు, కేసుల పురోగతిపై సమీక్ష

రాత్రి 9 గంటల వరకు సచివాలయంలోనే ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ)ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. నియామక ప్రక్రియలో అత్యంత సమర్థవంతమైన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విధానం, ఇతర రాష్ట్రాల కమిషన్‌లను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఢిల్లీ, పలు రాష్ట్రాలకు బృందాన్ని పంపాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఉద్యోగ నియామకాల్లో అత్యంత కట్టుదిట్టంగా ఉండాలని స్పష్టం చేశారు. టీఎ్‌సపీఎస్సీపై సీఎం రేవంత్‌ మంగళవారం సచివాలయంలో సీఎస్‌ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు, చైర్మన్‌, సభ్యుల నియామక అర్హతలు, గ్రూప్‌-1, ఏఈఈ తదితర పరీక్ష పేపర్ల లీకేజీపై వివరాలు, కేసుల పురోగతి, విచారణ, తదుపరి కార్యాచరణను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాక చేపట్టిన నియామకాలు, మిగిలినవాటి పరిస్థితి, పరీక్షల నిర్వహణ వివరాలను ఆరా తీశారు. కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కావాల్సిన సిబ్బంది, ఇతర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల పనితీరుపై సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. గతంలో జరిగిన ఉదంతాలను ప్రస్తావిస్తూ.. పది, ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు అవసరం ఎక్కడ ఉందో నివేదిక ఇవ్వాలన్నారు. ప్రధానంగా బాలికలకు కళాశాలల అవసరాన్ని గుర్తించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఉపాధి కేంద్రంగా మూసీ పరివాహకం

హైదరాబాద్‌లో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి కేంద్రంగా మార్చాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడానికి అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ పరిధిలో మూసీ ప్రవేశం నుంచి చివ రి వరకు వంతెనలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, హ్యాకర్‌ జోన్‌లు, పాత్‌-వేలను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి , పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించారు.

మొత్తం 10 గంటలు.. ఒక్కో శాఖకు 2 గంటలు

సుదీర్ఘంగా సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌

ప్రభుత్వంలోని వివిధ శాఖలపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సుదీర్ఘంగా సమీక్షించారు. దాదాపు 10 గంటల పాటు సచివాలయంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సచివాలయానికి వచ్చిన ఆయన రాత్రి 8 గంటల వరకు సమీక్షలు నిర్వహించారు. అనంతరం గంట పాటు సందర్శకులను కలిశారు. సమీక్షల సందర్భంగా ఒక్కో శాఖకు రెండు గంటల సమయం కేటాయించడం గమనార్హం. మంగళవారం టీఎ్‌సపీఎస్సీ, విద్యా శాఖ, మూసీ రివర్‌ ఫ్రంట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. అధికారుల పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అనంతరం అన్ని వివరాలపై సీఎం ఆరా తీస్తుండడం గమనార్హం.

Updated Date - 2023-12-13T03:41:44+05:30 IST