విహారయాత్రలో విషాదం
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:45 PM
విహారయాత్రకు వచ్చిన బీటెక్ విద్యార్థి నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగి మృతి చెందాడు.
సాగర్ బ్యాక్‌వాటర్‌లో మునిగి బీటెక్ విద్యార్థి మృతి
నేరేడుగొమ్ము, డిసెంబరు 26: విహారయాత్రకు వచ్చిన బీటెక్ విద్యార్థి నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు, విద్యార్థి స్నేహితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన మనోహర్‌రావు, పద్మ దంపతుల కుమారుడు ఆశీష్(23) ఇబ్రహీంపట్నంలోని ఏవీఎన కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులు రావడంతో సోమవారం ఉదయం మిత్రులు రాకే్‌షరెడ్డి, రాజేష్, వాజీర్, పవనకల్యాణ్‌తో కలిసి కారులో నేరేడుగొమ్ము మం డలం వైజాగ్ కాలనీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం మిత్రులందరూ ఈత కొట్టేందుకు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లోకి దిగారు. ఆశీష్ బ్యాక్‌వాటర్ గుంతలో మునిగిపోవటంతో గమనించిన స్నేహితులు కేకలు వేయగా స్థానికులు, మత్స్యకారులు అక్కడికి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహకారంతో వెతకగా ఆశీష్ మృతదేహం లభ్యమైంది. దేవరకొండ ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.