సంప్రదాయం, నవీకరణ..
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:32 AM
సాయుధ విభాగాల్లో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు చోటు కల్పించడం ఎంతో ఆవశ్యకమని అయితే వాటితో పాటు సంప్రదాయ ఆవిష్కరణలు, సాంకేతికను కూడా వినియోగించడం అంతే ముఖ్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
సాయుధ దళాల్లో రెండూ కీలకమే.. వాటి మధ్య సమన్వయం ఉండాలి
అధికారులు వినూత్నంగా ఆలోచించాలి
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
దుండిగల్‌లో ముగిసిన క్యాడెట్స్ శిక్షణ
గుమ్మడిదల/అల్వాల్ డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సాయుధ విభాగాల్లో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు చోటు కల్పించడం ఎంతో ఆవశ్యకమని అయితే వాటితో పాటు సంప్రదాయ ఆవిష్కరణలు, సాంకేతికను కూడా వినియోగించడం అంతే ముఖ్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రెండింటి మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్(సీజీపీ)కు భారత వాయు సేనాధిపతి వీఆర్ చౌదరితో కలిసి రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాడెట్స్‌కు వింగ్స్ ప్రధానం చేశారు. అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడారు. కొత్తగా నియమితులైన అధికారులు వినూత్న ఆలోచనలతో పనిచేయాలని కోరారు. సాయుధ దళాల్లో సంప్రదాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అయితే, కొత్త ఆలోచనలు లేకుండా దీర్ఘ కాలంపాటు సంప్రదాయ విధానాలనే పాటిస్తే వ్యవస్థలో స్తబ్ధత నెలకొంటుందని తెలిపారు. దీనిని నిరోధించి, మారుతున్న కాలంతో పోటీ పడాలంటే సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ శాఖలకు ప్రాతినిఽథ్యం వహిస్తున్న 213 ఫ్లైట్ క్యాడెట్స్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ పొందిన అధికారులలో 25 మంది మహిళా అధికారులను భారత వాయుసేనలోని వివిధ శాఖల్లో నియమించారు. అదనంగా ఇండియన్ నేవీ నుంచి 8 మంది అధికారులు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 9 మంది అధికారులు, వియాత్నాం పీపుల్స్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఇద్దరు అధికారులు ఫ్లయింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ పైలట్ కోర్సులో అన్ని విభాగాల్లో మెరిట్ సాధించి ప్రెసిడెంట్ ఫ్లాగ్‌ను, చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్ స్వార్డ్(కరవాలం)ను అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్‌జీత్ సింగ్‌ను ‘ప్రెసిడెంట్స్ కమిషన్’తో సత్కరించారు.
అబ్బురపరిచిన విన్యాసాలు..
పరేడ్ అనంతరం అకాడమీలో ప్రదర్శించిన స్కైడైవింగ్, ఆకాష్, సూర్య కిరణ్, ఫిలాటస్ పీసీ-7 ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు, సుఖోయ్-30, సూర్య కిరణ్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు, గంటకు వెయ్యి కి.మీ.వేగంతో ఎదురెదురుగా వచ్చి సెకన్లలోనే తప్పుకోవడం వంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. సారంగ్, ఏరోబాటిక్ బృందం ప్రేక్షకులను అబ్బురపరిచారు.