టమాటా లోడ్ లారీ బోల్తా!
ABN , First Publish Date - 2023-07-16T02:50:42+05:30 IST
కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 ధర పలుకుతున్న ఈ తరుణంలో టమాటాల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తాపడితే
ఆ వాహనంలో రూ.21 లక్షల విలువైన 18 టన్నుల సరుకు
బందోబస్తుకు పరుగెత్తుకొచ్చిన పోలీసులు.. జనంలో నిరాశ
భద్రత మధ్య మరో లారీలోకి సరుకు.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
టమాటా మరింత పైకి.. వికారాబాద్ జిల్లా ధారూరులో కిలో రూ.200
మావల, ధారూరు, జూలై 15: కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 ధర పలుకుతున్న ఈ తరుణంలో టమాటాల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తాపడితే? అందినకాడికి తీసుకెళ్లడానికి జనం ఏ స్థాయిలో ఎగబడతారో ఊహించుకోండి! ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని జాతీయ రహదారిపై శనివారం ఓ టమాటాల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గంపలు, బస్తాలతో పెద్ద సంఖ్యలో పరుగెత్తుకు వచ్చారు! కానీ ఆ లోపే సమాచారం అందడంతో పోలీసులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు! ఆ లారీలో కనీసం రూ.21 లక్షల విలువైన 18 టన్నుల టమాటాలున్నాయి. లారీ బోల్తా పడటంతో బాక్సుల్లోంచి టమాటాలు నేలమీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ సరుకంతా కర్ణాటక నుంచి ఢిల్లీ వెళుతోంది. డ్రైవర్ అక్రమ్, క్లీనర్ ముషారఫ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. టమాటాలు చెల్లాచెదురుగా పడటం, సరుకు దోపీడీ జరిగే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన డ్రైవర్, పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లారీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో స్థానికులు ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తండోపతండాలుగా అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులను చూసి నిరాశగా వెనుదిరిగారు. పోలీసులు మరో వాహనాన్ని ఏర్పాటు చేయించి టమాటలను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు రాష్ట్రంలో టమాటా ధరలు ఏమాత్రం తగ్గట్లే! పైగా వికారాబాద్ జిల్లాలో టమాటా ధర ‘డబుల్ సెంచరీ’ కొట్టింది! ఽధారూరులో కిలో టమాటా రూ.200 చొప్పున విక్రయించారు. సంతకొచ్చిన జనం ఈ ధర చూసి నోరెళ్లబెట్టారు.