Share News

పల్లెటూరుకు..పోల్‌టూరు!

ABN , First Publish Date - 2023-11-29T04:44:11+05:30 IST

వృత్తి, ఉపాధి రీత్యా హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, ముంబై తదితర నగరాలకు వలసవెళ్లిన తెలంగాణవాసులందరి నోటా ఇప్పుడు ఇదే మాట! వీరందరి రాకతో గురువారం నుంచి ఆదివారం దాకా తెలంగాణలోని గ్రామాలన్నీ కళకళలాడనున్నాయి.

పల్లెటూరుకు..పోల్‌టూరు!

ఓటు వేసేందుకు హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, ముంబై సహా పలు ప్రాంతాల నుంచి గ్రామాలకు వస్తున్న ఓటర్లు

ఎక్కడెక్కడ ఉన్నవారినీ ఫోన్లు చేసి పిలిపిస్తున్న అభ్యర్ధులు

వచ్చి, వెళ్లేందుకు అయ్యే ఖర్చు బాధ్యత మొత్తం వారిదే!

పోలింగ్‌ మర్నాడు సెలవు పెట్టుకుంటే 4 రోజులు సెలవులు

ఊరికి పోదాం చలో చలో.. ఓటు వేద్దాం చలో చలో..

..వృత్తి, ఉపాధి రీత్యా హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, ముంబై తదితర నగరాలకు వలసవెళ్లిన తెలంగాణవాసులందరి నోటా ఇప్పుడు ఇదే మాట! వీరందరి రాకతో గురువారం నుంచి ఆదివారం దాకా తెలంగాణలోని గ్రామాలన్నీ కళకళలాడనున్నాయి. ఎందుకంటే.. హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నవారికి పోలిం గ్‌ రోజైన గురువారం సెలవు శుక్రవారం సెలవు పెట్టుకుంటే.. శని, ఆదివారాలు ఎలాగు సెలవురోజులే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు గురు, శుక్రవారాలు సెలవు పెట్టుకుంటే చాలు. ఓటు వేయడానికి వచ్చి 4 రోజుల పాటు కుటుంబసభ్యులు, స్నేహితులతో గడిపే అవకాశం ఉండడంతో చాలామంది ఉత్సాహం చూపుతున్నారు.

పక్కాగా ఏర్పాట్లు..

‘‘ఒక్క ఓటు కూడా మిస్‌ అవ్వకూడదు. మనకే పడాలి. మన సెగ్మెంట్‌ ఓటర్లు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించండి. వారిని పిలిపించండి. ఎంత ఖర్చైనా మనమే భరిద్దాం’’ అంటూ అభ్యర్ధులు తమ కేడర్‌కు ఆదేశిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండి, ఉపాధిరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లినవారిని ఎక్కడున్నా సరే పిలిపించి మరీ ఓటు వేయించేందుకు సిద్ధమైన అభ్యర్థులు.. గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను వడపోస్తున్నారు. వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారితో ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఐటీ సహా ఇతర ఉద్యోగాలకు కోసం వెళ్లిన ప్రతీ ఒక్కరినీ బుధవారం సాయంత్రానికల్లా నియోజకవర్గానికి తీసుకువచ్చేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఫోన్‌చేసి.. ఇతర పార్టీల వారెవరైనా వారితో మాట్లాడారా? ఒకవేళ మాట్లాడి ఉంటే వారు ఏం హామీలిచ్చారు? అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. వారిచ్చిన హామీలకంటే ‘ఎక్కువ’ ఇచ్చి అయినా సరే ఓటు తమకే పడేలా ప్లాన్‌ చేస్తున్నారు.

అడ్వాన్సుగా పేమెంట్‌ యాప్‌ల ద్వారా ఎంతో కొంత మొత్తం వారి ఖాతాల్లో వేస్తున్నారు. వారు వచ్చి, వెళ్లడానికి అయ్యే ఖర్చులను భరించడానికి సిద్ధమవుతున్నారు. ఉదాహరణకు.. ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఒక గ్రామంలోని నలుగురు ఓటర్లు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. ఓటర్ల జాబితాలో వారిని గుర్తించిన ఓ అభ్యర్థి తాలుకా అనుచరులు.. అక్కడి వారికి ఫోన్‌ చేసి, మీరు వచ్చి, వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో సహా అన్ని తామే చూసుకుంటామని, ఓటు మాత్రం కచ్చితంగా తమ నేతకే వేయాలంటూ కోరారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఓటేసే వరకు.. వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దని కోరుతున్నారు. ఆ ఒక్క నియోజకవర్గమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్నవారిని నియోజకవర్గాలకు రప్పించడానికి.. పలువురు అభ్యర్థులు ఏకంగా కార్లు కూడా సిద్ధం చేస్తున్నారు.

ఫస్ట్‌ టైమ్‌ ఓటర్స్‌ ముఖ్యం..

ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వచ్చిన విద్యార్థులు, యువత కూడా ఓటు వేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. వారు కూడా తమకే ఓటు వేసేలా పలు పార్టీల అభ్యర్థులు, క్యాడర్‌ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే వారు ఎవరికి దగ్గరగా ఉంటారు, ఎవరితో చెప్పిస్తే తమకు ఓటు వేస్తారనే అంశాలను బేరీజు వేసి మరీ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు.

హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-11-29T04:44:12+05:30 IST