REVANTH : ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే..
ABN , First Publish Date - 2023-10-03T04:05:52+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్‌ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన అందుకే
కేసీఆర్ కుటుంబ అవినీతిపై మౌనమెందుకు?
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం
మోదీ రాకతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
ఆ ఖర్చుతో పాలమూరును అభివృద్ధి చేయొచ్చు
బిల్లా-రంగాలా తిరుగుతున్న హరీశ్‌రావు, కేటీఆర్
అభివృద్ధిపై చర్చకు మంత్రులు సిద్ధమా?: రేవంత్
బీసీలకు బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ సీట్లిస్తామని వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్‌ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట ఓట్లను చీల్చి.. పరోక్షంగా బీఆర్‌ఎ్‌సను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పాలమూరు పర్యటనలో.. కేసీఆర్ కుటుంబ అవినీతి, దోపిడీపై విచారణ జరిపిస్తామని మోదీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. దాంతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, ఆ రెండు పార్టీలూ ఒకటేనని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ప్రజలకు నిరాశే మిగిల్చిందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక గుజరాత్‌కు మాత్రమే ప్రధాన మంత్రా? అని ప్రశ్నించారు.
బీజేపీని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రమోద్ మహాజన్ పుట్టింది పాలమూరు జిల్లాలోనేనని గుర్తు చేశారు. ఆ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. జిల్లాకు ఏదైనా ప్రకటిస్తారని అందరూ ఆశించారని, కానీ.. ఆయన పర్యటన ఖర్చుల మందం కూడా జిల్లాకు ఏమీ ప్రకటించలేదని విమర్శించారు. మోదీ పర్యటన ఖర్చుతో జిల్లానే అభివృద్ధి చేయవచ్చన్నారు. పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చి పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించకుండా పాత అంశాలే అయిన గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డులను కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టిన మోదీని పాలమూరు జిల్లాకు తీసుకువచ్చి సభ నిర్వహించినందుకు ఆ పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన మోదీతో సభ నిర్వహించడం అనైతికమని భావించే ఆ పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, రాజగోపాల్‌రెడ్డి ఆ సభకు రాలేదన్న చర్చ నడుస్తోందన్నారు. తెలంగాణ పట్ల మోదీ వివక్ష చూపుతున్నారని, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఆయన పర్యటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
భిల్లా-రంగాల్లా తిరుగుతున్న హరీశ్, కేటీఆర్
మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను పేరుమోసిన నేరస్తులైన భిల్లా-రంగాలతో రేవంత్ పోల్చారు. 2004-2014 వరకు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఈ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ వారికి సవాల్ విసిరారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయా.. అంటూ కేటీఆర్, హరీశ్ మాట్లాడుతున్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దేశంలోని ఇతర ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో లేనివిధంగా ఆరోగ్యశ్రీ, రైతు రుణమాపీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసింది. రాష్ట్రాల ఆదాయం, అవసరాలను బట్టి పథకాలు ఉంటాయి. రాజ్యాంగం విలువలు తెలియని, ఈ భిల్లా, రంగాలు.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారు’’ అని రేవంత్ మండిపడ్డారు. హరీశ్‌రావు, కేటీఆర్ ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా వారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. తెలంగాణ కాంగ్రె్‌సకు నిధుల కోసం బెంగళూరు బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500 చొప్పున కర్ణాటక ప్రభుత్వం వసూలు చేస్తోందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణపైనా రేవంత్ స్పందించారు. ‘‘కేటీఆర్ చేసిన ఆరోపణపై విచారణ జరిపించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసి విచారణకు ఒప్పిస్తా. తెలంగాణ ప్రభుత్వ వసూళ్ల పైనా విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేఖ రాస్తా. ఆమోదించి విచారణ జరిపిస్తారా?’’ అని రేవంత్ సవాల్ చేశారు.
కేటీఆర్‌కు ఎన్టీఆర్‌తో పోలికా?
ఎన్టీఆర్ పేరుతో పోల్చుకునే అర్హత కేటీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీలోని ఏ నాయకునికీ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అధికారాన్ని అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబం ఏనాడూ సచివాలయానికి రాలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిన్న మాట కూడా చెప్పలేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో పోల్చుకుంటే స్వర్గంలో ఉన్న ఆయన ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేసిందే కేసీఆర్ అని, అన్నారు.
బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు దాటవు: రేవంత్
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 25 సీట్లకు మించి గెలవదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాని ఓటర్లు 19 శాతం వరకు ఉంటారని, వాటిలో మెజారిటీ ఓట్లు తమకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని, కాంగ్రెస్ వేవ్‌ను ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో రేవంత్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాతే ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆశావహుల కోసం పీసీసీ అధ్యక్షుడిగా తాను కొట్లాడతానని, సర్వేల్లో ఓసీల కంటే బీసీలకు 2 శాతం తక్కువ ఉన్నా.. బీసీలకే టికెట్ ఇస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే తాము ఎక్కువే ఇస్తామని అన్నారు.