జాని తక్కెడశిల, చదువులబాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు

ABN , First Publish Date - 2023-06-24T00:56:29+05:30 IST

ప్రముఖ రచయితలు జాని తక్కెడిశిల (32), చదువులబాబులకు 2023 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి.

జాని తక్కెడశిల, చదువులబాబుకు  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి)/ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 23 : ప్రముఖ రచయితలు జాని తక్కెడిశిల (32), చదువులబాబులకు 2023 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. జాని తక్కెడిశిల రచించిన సాహితీ విమర్శనాగ్రంథం ‘వివేచని’కి యువ సాహితీ పురస్కారాన్ని, డీకే చదువులబాబు రచించిన ‘వజ్రాల వాన’ కథాసంపుటికి బాల సాహితీ పురస్కారాన్ని అందించాలని నిర్ణయించినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. పురస్కార గ్రహీతలకు రూ.50వేలు నగదుతోపాటు తామ్రపత్రం లభిస్తాయి. యువ సాహిత్య పురస్కారం ఎంపిక జ్యూరీలో సాహితీవేత్తలు ఆవుల మంజులత, దర్భశయనం శ్రీనివాసాచార్య, వడ్డేపల్లి కృష్ణ ఉన్నారు. రచయితలు దాసరి వెంకటరమణ, కె.రాణిప్రసాద్‌, నారంశెట్టి ఉమామహేశ్వరరావు... బాల సాహిత్య పురస్కారానికి జ్యూరీ సభ్యులుగా వ్యవహరించినట్లు సమాచారం. జాని తక్కెడ శిల, డీకే చదువులబాబు ఇద్దరూ కడప జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం, జాని తక్కెడశిల పులివెందులలో జన్మించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆన్‌లైన్‌ ప్రచురణాసంస్థలో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ప్రొద్దుటూరులో స్థిరపడిన చదువులబాబు జమ్మలమడుగులోని పెద్దపసుపులలో జన్మించారు, 21కిపైగా బాలసాహితీ సంపుటాలు ఆయన వెలువరించారు.

Updated Date - 2023-06-24T04:00:01+05:30 IST