Share News

Three new commissioners : ముగ్గురు కొత్త కమిషనర్లు

ABN , First Publish Date - 2023-12-13T03:29:37+05:30 IST

కీలకమైన పోలీసుశాఖపై సీఎం రేవంత్‌ మార్క్‌ ప్రారంభమైంది. పోలిసింగ్‌, అధికారుల పనితీరుపై అవగాహన ఉన్న సీఎం.. పోలీసు అధికారుల పోస్టింగులు, బదిలీల్లో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Three new commissioners : ముగ్గురు కొత్త కమిషనర్లు

హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

సైబరాబాద్‌కు అవినాష్‌ మహంతి.. రాచకొండకు సుధీర్‌బాబు

నార్కొటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్య

స్టీఫెన్‌ రవీంద్ర, డీఎస్‌ చౌహాన్‌ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌

త్వరలో మరిన్ని బదిలీలకు రంగం సిద్ధం

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కీలకమైన పోలీసుశాఖపై సీఎం రేవంత్‌ మార్క్‌ ప్రారంభమైంది. పోలిసింగ్‌, అధికారుల పనితీరుపై అవగాహన ఉన్న సీఎం.. పోలీసు అధికారుల పోస్టింగులు, బదిలీల్లో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన మొదటి దఫా బదిలీల్లోనే అత్యంత కీలకమైన హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లను బదిలీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు ఆరుగురు ఐపీఎ్‌సలను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు డీజీపీ (ఆర్గనైజేషన్స్‌ అండ్‌ లీగల్‌) కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న సుధీర్‌ బాబును రాచకొండ కమిషనర్‌గా, సైబరాబాద్‌ జాయింట్‌ సీపీగా ఉన్న అవినాష్‌ మహంతిని ఏకంగా సైబరాబాద్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు రాచకొండ సీపీగా ఉన్న దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌, సైబరాబాద్‌ సీపీగా ఉన్న స్టీఫెన్‌ రవీంద్రను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని సీఎస్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను తప్పించి ఆయన స్థానంలో పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సందీప్‌ శాండిల్యను ఈసీ నియమించింది. తాజా బదిలీల్లో సందీప్‌ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కొటిక్‌ బ్యూరో (టీఎస్‌ నాబ్‌) డైరెక్టర్‌గా నియమించారు. రాష్ట్రాన్ని డ్రగ్‌ రహితంగా మార్చే లక్ష్యాన్ని ఆయనకు సీఎం రేవంత్‌ నిర్దేశించారు. ప్రస్తుత బదిలీల్లో కీలక స్థానాల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులు ముక్కుసూటిగా, నిబంధనల మేరకు పనిచేస్తారనే పేరు ఉంది. వాస్తవానికి, ఆ నిక్కచ్చితనం కారణంగానేగత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీరిని పక్కన పెట్టి ఇబ్బందులకు గురి చేసిందన్న వాదనలున్నాయి. అయితే, మంచి ఆఫీసర్లుగా పేరొందిన ఆ అధికారులను ఎంచుకుని మరీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పటం విశేషం.

అధికారుల నేపథ్యం..

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. బోధన్‌ ఏఎస్పీగా కెరీర్‌ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా, గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌గా, ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా, అడిషనల్‌ డైరెక్టర్‌గా, కోస్టల్‌ సెక్యూరిటీ ఐజీగా, ట్రైనింగ్‌ ఐజీగా, గ్రేహౌండ్స్‌ ఐజీగా, ఆక్టోపస్‌ ఐజీగా, ఏడీజీ గ్రేహౌండ్స్‌గా, ఏడీజీ ఆర్గనైజేషన్స్‌గా పలు విభాగాల్లో విధులు నిర్వహించారు. రాచకొండ సీపీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్‌ బాబు 2001 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన రాచకొండ జాయింట్‌ సీపీగా, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, పలు జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. సైబరాబాద్‌ కమిషనర్‌గా నియమితులైన అవినాష్‌ మహంతి 2005 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. ఆయన గతంలో మెదక్‌ ఎస్పీగా, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా, హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ సీపీగా, సైబరాబాద్‌ జాయింట్‌ సీపీగా, అడిషనల్‌ సీపీగా పని చేశారు. తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా నియమితులైన సందీప్‌ శాండిల్య 1993 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ఇటీవల ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన శాండిల్య.. విధుల్లో చేరిన మొదటి రోజు నుంచే ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పక్షపాతంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు, ఎన్నికలకు ఒక రోజు ముందు ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, డ్రగ్స్‌ అనే మాట అనటానికే భయపడే పరిస్థితులు తీసుకురావాలని సీఎం రేవంత్‌ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్యకు బాధ్యతలు అప్పగించటం విశేషం. అయితే, వచ్చే ఏడాది మేలో సందీప్‌ శాండిల్య పదవీ విరమణ చేయనున్నారు.

త్వరలో మరిన్ని బదిలీలు

ఎన్నికల వేళ విధుల నుంచి తప్పించిన అధికారులతోపాటు పలు కీలక కమిషనర్లు, ఎస్పీలతోపాటు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు అధికారుల్ని మార్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుశాఖలో త్వరలో మరిన్ని బదిలీలు ఉంటాయని సమాచారం. రెండో విడతలో పలువురు కీలక ఐపీఎ్‌సలను మార్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి హోంశాఖపై మరో నాలుగు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నారని, ఇప్పటికే నిఘా విభాగం నుంచి సీఎంకు సమాచారం అందిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్‌ పోలిసింగ్‌ ఎలా ఉండాలి, అందుకు అనుసరించాల్సిన విధానాలు, మహిళా భద్రత, మానవ అక్రమ రవాణాను అరికట్టడం తదితర అంశాలపై సీఎం రేవంత్‌.. పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపాయి. గత ప్రభుత్వ హయాంలో, పేరుకే ఫ్రెండ్లీ పోలిసింగ్‌గా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు పోలీసు శాఖ కొంత దూరమైందన్న విమర్శ ఉందని, దానిపైనా సీఎం చర్చిస్తారని ఆ వర్గాలు పేర్కొనాయి.

Updated Date - 2023-12-13T03:29:38+05:30 IST