Kumaram Bheem Asifabad: అగ్ని ప్రమాదంలో మూడు ఇళ్లు దగ్ధం
ABN , Publish Date - Dec 23 , 2023 | 10:06 PM
మండలంలోని ఖైరి గ్రామంలో శనివారం మూడు పెంకుటిళ్లు దగ్ధమయ్యాయి
కెరమెరి, డిసెంబరు 23: మండలంలోని ఖైరి గ్రామంలో శనివారం మూడు పెంకుటిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మోర్లె సోమయ్య, చంద్రయ్య, కమలాబాయిల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. సోమయ్య ఇంట్లో పత్తి నిలువ చేశాడు. అక్కడే విద్యుత్ తీగలు, మీటర్ సైతం ఉంది. షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు లేచి నిల్వ చేసిన పత్తిపై పడ్డాయి. మంటలు అంటుకుని పక్క ఇళ్లకు మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సోమయ్య, చంద్రయ్య, కమలాబాయి ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన ఫైర్ ఇంజన్ వచ్చే వరకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 4లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 30 క్వింటాళ్ల పత్తి, తులం బంగారం, ఇతర నిత్యావసర సరుకులు కాలి పోయినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేరు. సంఘటన స్థలాన్ని ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ దృపతాబాయి, తహసీల్దార్ జమీర్ హైమద్, ఎంపీడీఓ మహేందర్ తదితరులు పరిశీలించారు.