వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:44 PM
అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకోగా, మరో యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కనగల్, డిసెంబరు 26 : అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకోగా, మరో యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి దాటాకా నల్లగొండ-హాలియా ప్రధాన రహదారిపై ఎస్.లింగోటం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాలియాకు చెందిన స్నేహితులు దోరెపల్లి తరుణ్(22), ఉప్పునూతల చరణ్‌లు సోమవారం అర్ధరాత్రి స్కూటీపై హాలియా నుంచి నల్లగొండకు బయలుదేరారు. చరణ్ బైక్ నడుపుతున్నాడు. మార్గమధ్యలో ఎస్.లింగోటం స్టేజీ వద్ద విద్యుత స్తంభాన్ని అతివేగంతో ఢీకొట్టారు. ప్రమాదంలో తరుణ్, చరణ్‌ల తలలకు బలమైన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండకు తరలించారు. చికిత్స పొందుతూ తరుణ్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఆయన తండ్రి వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
బైక్‌ను ఢీకొనడంతో
నల్లగొండ టౌన, డిసెంబరు 26 : నల్లగొండ జిల్లా కేంద్ర పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. టూ టౌన ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెం గ్రామానికి చెందిన కొల్లు దామోదర్ రెడ్డి(48) గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ పట్టణంలోని శివాజీనగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. రోజు మాదిరిగా గ్రామానికి వెళ్లి పనులు ముగించుకొని నల్లగొండకు బైక్‌పై వస్తుండగా మంగళవారం రాత్రి పానగల్లు కట్ట కింద అర్బన ఆసుపత్రి సమీపంలో ఎదురుగా వచ్చిన బైకును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వైద్యవిద్యార్థి...
చిట్యాల, డిసెంబరు 26 : నల్లగొండ జిల్లా చిట్యాలలో సోమవారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ మెడికల్ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల శివారులో ఈ నెల 25న కారు, బైక్ ఢీకొన్న ఘటనలో కామినేని వైద్య కళాశాల విద్యార్థి బిరుదు సాయితేజ(20)తో పాటు మరో విద్యార్థి యశస్వి గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సాయితేజ మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. సాయితేజ స్వస్థలం జడ్చర్ల అని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.