యాదగిరీశుడి సన్నిధికి నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు

ABN , First Publish Date - 2023-01-18T00:29:25+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూడు రాష్ట్రాల సీఎంలు బుధవారం దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ యాదగిరిగుట్ట క్షేత్రానికి ఈనెల 18న రానున్నారు.

 యాదగిరీశుడి సన్నిధికి నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు

కేసీఆర్‌తో పాటు రానున్న కేరళ, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు పినరయ్‌ విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఖమ్మం సభకు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూడు రాష్ట్రాల సీఎంలు బుధవారం దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ యాదగిరిగుట్ట క్షేత్రానికి ఈనెల 18న రానున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఖమ్మంలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు వీరు తరలివెళ్లనున్నారు.

దక్షిణ తెలంగాణలో పేరుగాంచిన యాదగిరీశుడి ఆలయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకొని పునర్నిర్మించిం ది. గుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఇలవేల్పుగా భావిస్తుంటారు. టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎస్‌ గా మార్చిన అనంతరం తొలిసారిగా పార్టీ ఆవిర్భావ సభను ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేశారు. ఈ సభకు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, సీనియర్‌ నాయకులను కేసీఆర్‌ ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ తొలి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆయనతోపాటు కేరళ, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను యాదగిరిగుట్ట పర్యటనకు తీసుకురానున్నారు.

అధికారుల ఏర్పాట్లు

యాదిగిరీశుడి సన్నిధికి ముగ్గురు సీఎంలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తోపాటు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ పమేలాసత్పథి, డీసీపీ కె.నారాయణరెడ్డి, ఆలయ ఈవో ఎన్‌.గీత, ఆర్‌అండ్‌బీ, దేవాదాయశాఖ అధికారులు యాదగిరిగుట్టలో మంగళవారం సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. హెలీప్యాడ్‌, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ వద్ద భద్రతను పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొండపైకి వెళ్లే వాహనాల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అదేవిధంగా ఏర్పాట్లను సీపీ దేవేంద్రసింగ్‌చౌహన్‌ పరిశీలించారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఉద యం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు భక్తులకు స్వామివారి ఉభయ దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేసినట్టు ఈవో ఎన్‌.గీత ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రుల పర్యటన ఇలా..

యాదగిరిగుట్ట ఉత్తర భాగాన పాతగోశాల వద్ద హెలీప్యాడ్లు ఏర్పాటుచేశారు. రెండు హెలీకాప్టర్లలో ముఖ్యమంత్రులు, పలువురు నేతలు ఇక్కడికి చేరుకోనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్‌ నుంచి వారు బయల్దేరి 11.30గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. గోశాల హెలీప్యాడ్‌ నుంచి వాహనాల్లో నేరుగా ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న అనంతరం రెండోఘాట్‌ రోడ్డు మీదుగా కొండపైకి వెళ్తారు. గతంలో బాలాలయం ఉన్నచోట ముఖ్యమంత్రు ల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి వారు నేరుగా ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం అద్దాల మండపాన్ని పరిశీలిస్తారు. అక్కడే వారికి పూజారులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. ఇక్కడి నుంచి వారు శివాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు హెలీకాప్టర్‌లో ఖమ్మం బయల్దేరుతారు.

Updated Date - 2023-01-18T00:29:29+05:30 IST