CM REVANTH REDDY : సభలోనూ ఉండరు
ABN , Publish Date - Dec 17 , 2023 | 03:59 AM
‘‘నిరంకుశ పాలన ఎప్పటికీ సాగదు,. నియంతృత్వం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు.
ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు..
మారకపోతే అసెంబ్లీ నుంచీ తరిమేస్తారు
వ్యవసాయం, విద్యుత్తుపై చెప్పేవన్నీ అబద్దాలే
డ్రగ్స్ కేసులో ఎంతటివారినైనా బొక్కలో వేస్తాం
వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం
కేసీఆర్ ధర్నాచౌక్‌లో ఆమరణ దీక్ష చేసుకోవచ్చు
సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు
పదేళ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు
కేసీఆర్‌కు పదవులు ఇచ్చిందే కాంగ్రెస్
కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘నిరంకుశ పాలన ఎప్పటికీ సాగదు,. నియంతృత్వం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రజా తీర్పును గౌరవించండి.. ఇకనైనా మారండి. లేదంటే ఈ పాత్ర కూడా ఉండదు. అసెంబ్లీ నుంచీ తరిమేస్తారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ తమ ఘనతగా చెప్పుకొనే రైతుబంధు, ఉచిత విద్యుత్తుపై చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నా.. గత ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని, యువతరం నాశనమవుతున్నా మౌనంగా ఉండిపోయిందని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘ఏందిరా ఏందిరా తెలంగాణ! ఎలా మూగబోయింది జనగాణ!! ఏందిరా ఏందిరా తెలంగాణ! యముల పాలవుతోంది మాగాణ!!’’ అంటూ ప్రముఖ కవి అందెశ్రీ రాసిన కవితతో ప్రసంగం ప్రారంభించిన రేవంత్‌రెడ్డి.. దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశించానని, కానీ.. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా మళ్లీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తినే ఎన్నుకున్నారని విమర్శించారు. తద్వారా ప్రజాతీర్పును కేసీఆర్ గమనించలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని నాటి హోంమంత్రి మహమూద్ అలీని హోంగార్డు అడ్డుకున్నారని, మరో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను వెనక్కి పంపారని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఎండలో గంటల తరబడి నిరీక్షించినా అనుమతించలేదని తప్పుబట్టారు. సీఎంను మంత్రులే కలవలేని పరిస్థితి ఉంటే.. ఇక ప్రజలకు ప్రవేశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అందుకే ప్రజలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుపకంచెలను తొలగించామన్నారు. ‘‘మీలాగా నియంతృత్వ పాలన చేయాలనుకుంటే.. ఇప్పుడు అసెంబ్లీలో మిమ్మల్ని ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చేవాళ్లం కాదు’’ అని సీఎం రేవంత్ అన్నారు.
కుటుంబంపై శ్రద్ధ అమరవీరులపై ఏదీ?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా తన కుటుంబంపై చూపించిన శ్రద్ధను అమరవీరులపై ఎందుకు చూపించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు మంత్రి పదవులు ఇచ్చారని, కవితను ప్రజలు ఎంపీగా ఓడిస్తే.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా.. కొవిడ్ సమయంలో రూ.2 వేల మెడిసిన్‌ను రూ.50 వేలకు విక్రయించి రూ.426 కోట్ల నల్లధనంతో పట్టుబడ్డ వ్యక్తికి రాజ్యసభ పదవి ఇచ్చారని విమర్శించారు. కానీ, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, తదితర అమరవీరుల కుటుంబాలకు పదవులిచ్చారా? వారిని కనీసం ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిన వెంటనే కేటీఆర్, కవిత, హరీశ్‌రావుపై ఉన్న కేసులన్నీ ఎత్తేసిన సర్కారు.. ఉద్యమకారులపై కేసులను ఎందుకు ఎత్తేయలేదని నిలదీశారు? తెలంగాణ కోసం డీఎస్పీ పదవిని వదులుకున్న నళినికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. దర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజల నిరసన తెలిపే హక్కునూ కాలరాశారని ధ్వజమెత్తారు. తాము ధర్నాచౌక్‌ను పునరుద్ధరించామని, దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కూడా ధర్నాచౌక్‌లో ఆమరణ దీక్ష చేసుకోవచ్చునన్నారు.
రైతు చనిపోతేనే రైతుబీమా ఇస్తున్నారు..
రాష్ట్రంలోని రైతులకు వరికి కనీస మద్దతు ధర రూ.1960 ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని రైతులను అవమానించిన కేసీఆర్.. తాను మాత్రం ఫాంహౌ్‌సలోని 150 ఎకరాల్లో వరి పండించి క్వింటాలుకు రూ.4250 ధర పొందారన్నారు. ‘‘ రైతులకు గిట్టుబాటు కాని ధర కేసీఆర్‌కు ఎలా అయిందో చెప్పాలి.? ఈ విషయంపై విచారణకు మీరు సిద్ధమైతే నేను ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా. రైతుకు అందించని ధర సొంతానికి పొందిన కేసీఆర్.. ఈరోజు ఏం మోహం పెట్టుకుని మా పార్టీని విమర్శిస్తున్నారు?’’ అని రేవంత్ మండిపడ్డారు. రైతు ప్రభుత్వమని గొప్పగా చెప్పుకొన్నారని, కానీ.. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తూ వచ్చిందని ధ్వజమెత్తారు. రైతు ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్ అని చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని, రూ.9403తో తెలంగాణ 25వ స్థానంలో ఉందని కేంద్రప్రభుత్వం పార్లమెంటులో అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం గత పదేళ్లలో తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. రైతుల పంటలకు మద్దతు ధర, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే పంటల బీమా ఇవ్వకుండా.. రైతు చనిపోతేనే రూ.5 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పడం అత్యంత సిగ్గుచేటని రేవంత్ వ్యాఖ్యానించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు లేకపోవడం వల్లే రైతుబంధు అమలు చేసిన 2018 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 1,21,965 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చనిపోయిన తర్వాత కాకుండా.. ముందే రైతులను ఆదుకుంటే అన్నదాతల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదన్నారు. ఇక విద్యుత్తు తలసరి వినియోగంలోనూ గత ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని, తెలంగాణ పదో స్థానంలో ఉందని రేవంత్ పేర్కొన్నారు. స్కూల్ అచీవ్‌మెంట్ సర్వేలోనూ దేశంలో అట్టడుగున 31వ స్థానంలో ఉందన్నారు.
మిడ్ మానేరు పరిహారం సంతోష్‌కేనా..?
మిడ్ మానేరుపై అక్కడి రైతులు ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారని, అక్కడికి వెళ్లి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. దానిని ఎందుకు అమలు చేయలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అక్కడ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌కు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద 250 గజాల స్థలం ఇచ్చారని, ఆయన సోదరికీ స్థలం కేటాయించారని తెలిపారు. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా తన కుటుంబ సభ్యులకు ఇవ్వడమే రైతు సంక్షేమ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీరందించామని చెబుతున్న గొప్పలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందన్నారు. ‘‘ప్రాజెక్టుల ద్వారా నీరందిస్తే.. 2014లో 19 లక్షలున్న వ్యవసాయ పంపుసెట్లు ఇప్పుడు 29 లక్షలకు ఎలా పెరిగాయి.? భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తికాలేదు.?’’ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
వారికి ఇదే శిక్ష.. అంతా వినాల్సిందే
ఇందిరమ్మ రాజ్యంపై బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ విమర్శలు చేయడాన్ని సభలో సీఎం రేవంత్ ప్రస్తావించారు. పేదలకు భూములు పంచడం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడం, రైతును రాజు చేయడం.. ఇందిరమ్మ రాజ్యం ఘనతలు అని చెప్పారు. రాష్ట్రంలో గత పాలనలో ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు నేరెళ్లలో దళితలను ట్రాక్టర్లతో తొక్కించి చంపించారన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను పోలిసులతో అడ్డుకున్నారన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసగంగానికి కేటీఆర్, హరీశ్‌రావు అడ్డు తగలబోగా.. వాళ్లను సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ, ‘‘వారిని సస్పెండ్ చేయవద్దు. సభ నుంచి బయటికి పంపొద్దు అధ్యక్షా! ఇందిరమ్మ రాజ్యం గురించి వారు వినాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తమకు గీత, బైబిల్, ఖురాన్ లాంటివి. వీటి గురించి వారంతా వినాలి. ఇక్కడ కూర్చుని వినడమే వారికి విధించే శిక్ష’’ అని వ్యాఖ్యానించారు. టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకైతే దోషులపై కఠినంగా ఎందుకు వ్యవహరించలేదో గత ప్రభుత్వం చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాలను అంగట్లో అమ్ముకున్నారని, లక్షలాది నిరుద్యోగ అభ్యర్థులకు మానసిక క్షోభ మిగిల్చారని ఆరోపించారు. కమిషన్‌లో సభ్యుల నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టినా వారిని తొలగించకుండా ప్రేక్షకపాత్ర వహించారని విమర్శిం్తచారు. కనీసం పదో తరగతి పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉండేదన్నారు. ఇంటర్ పరీక్షల సాఫ్ట్‌వేర్‌ను సీజీజీ నుంచి మార్చి.. ఇతర ప్రైవేటు సంస్థకు కేటాయించారన్నారు.
ఉద్యమాల గడ్డపై గంజాయి మొక్కలు..
గత ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రం డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని రేవంత్ ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల్లోనూ విద్యార్థులకు విచ్చలవిడిగాన గంజాయి లభిస్తోందన్నారు. తెలంగాణ యువతను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దీనిపై మొక్కుబడిగా సిట్ విచారణ జరిపించారని, విచారణ అధికారిని బదిలీచేసి కేసును బలహీనపరిచారని ధ్వజమెత్తారు. 301 మంది సిబ్బందిని అడిగితే పదిశాతం కూడా ఇవ్వలేదని, రూ.29 కోట్ల బడ్జెట్ అడిగితే ఒక్క పైసా కేటాయించలేదని మండిపడ్డారు. దీనిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘గంజాయి మొక్కలను పెరగనివ్వం. కూకటివేళ్లతో పెకిలిస్తాం. ఇప్పటికే ప్రత్యేక అధికారిని నియమించాం. రూ.50 కోట్లు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డ్రగ్స్ రాకెట్‌లో ఎంతటివారైనా బొక్కలో వేస్తాం’’ అని రేవంత్ స్పష్టం చేశారు. డ్రగ్స్ విముక్త తెలంగాణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సోనియాగాంధీ ఉక్కు సంకల్పం వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. సోనియాగాంధీని కలిసి దండం పెట్టి ఆమెను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో అధికారం కాంగ్రె్‌సదేనన్నారు. ‘‘మేము పాలకులం కాదు సేవకులం అని భావించి పాలన సాగిస్తాం’’ రేవంత్ చెప్పారు.
కేసీఆర్‌కు పదవీ భిక్ష పెట్టిందే కాంగ్రెస్
కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే ఏంటో తెలియదంటూ కేటీఆర్‌నుద్దేశించి రేవంత్ వ్యాఖ్యాంచారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని అన్నారు. 51 శాతం వచ్చిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, 49 శాతం వచ్చినా...వారు విపక్షంలోనే ఉంటారని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. ‘‘మేం 39 మంది ఉన్నాం.. అచ్చోసిన ఆంబోతుల్లా పోడియంలోకి వెళ్లి కొట్లాట పెట్టుకుంటామంటే కుదరదు. కేసీఆర్‌కు పదవులిచ్చేందే కాంగ్రెస్. 2004లో ఎమ్మెల్యేగా గెలవకున్నా.. హరీశ్‌రావును మంత్రిగా చేసింది కాంగ్రెస్సే’’ అని రేవంత్ అన్నారు. పోతిరెడ్డిపాడుకు నాడు పొక్కపెట్టి నీళ్లు తీసుకుని వెళ్తుంటే.. అప్పుడు మంత్రి నాయిని నర్సింహారెడ్డి కడప ఇన్‌చార్జిగా ఉన్నారని తెలిపారు. ఆనాడు సభలో ఆ విషయం గురించి మాట్లాడింది పిజనార్దన్‌రెడ్డి అని గుర్తు చేశారు. నాడు టీఆర్‌ఎస్ నేతలు అధికారంలో ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మేనేజ్‌మెంట్ కోటాలో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి... సిరిసిల్ల సీటును కేకే మహేందర్‌రెడ్డి నుంచి తీసుకున్నది మీరు కాదా? అని కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ మేనిఫెస్టో అంశాలపై మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాతే గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నారు. ఆర్థిక నేరం, విధ్వంసం, ఏంటో బయటకు తీస్తామని హెచ్చరించారు.