Share News

ఎమ్మెల్యేలను కొంటారా?

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:09 AM

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తాం.. ఏడాది సైతం ఉండదు.. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా..? బేరసారాలు మొదలు పెడతారా..?

ఎమ్మెల్యేలను కొంటారా?

బేరసారాలు మొదలు పెడతారా?

కేటీఆర్‌ అలా మాట్లాడడం తగదు

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

మరో రెండ్రోజులు అసెంబ్లీ

20, 21 తేదీల్లో నిర్వహణ

విద్యుత్తు, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ!

ఆరు గ్యారెంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తాం.. ఏడాది సైతం ఉండదు.. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా..? బేరసారాలు మొదలు పెడతారా..? అని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అది మంచిది కాదని ఆయన హితవు పలికారు. అసెంబ్లీలో శనివారం కూనంనేని మాట్లాడుతూ ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని, కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని సూచించారు. తెలంగాణ ప్రజల నీతి నిజాయతీని పక్కదారి పట్టించొద్దని సూచించారు. గత పదేళ్ల కాలంలో కొనుగోలు, అమ్మకాలు, విపరీత స్థాయిలో జరిగాయని, రాజకీయ నాయకులను ఎంత మంది కొనుగోలు చేశారు, ఎంత మంది అమ్ముడుపోయారు అనే చర్చ ప్రజల్లో జరుగుతోందని ఆయన చెప్పారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్‌ మాట్లాడారని, ఇది మంచిది కాదన్నారు. అసెంబ్లీని ఎక్కువరోజులు నడిపేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో సభ మొక్కుబడిగా జరిగిందని, సభలో అర్థవంతమైన చర్చ జరగాలని సూచించారు. స్వేచ్ఛలేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీరించబోరని స్పష్టంచేశారు.

అదే మీతో వచ్చిన సమస్య... వెళ్లిపొమ్మంటే వెళ్తాను

తెలంగాణ సౌభాగ్య, సంపన్న రాష్ట్రమని చెప్పిన గత ప్రభుత్వ హాయాంలో ఒకటో తేదీన జీతాలు ఎందుకు పడలేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. అదేవిధంగా విద్యార్ధులకు రూ.7,500కోట్ల స్కాలర్‌షి్‌పలు ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి తప్పులను చేయకూడదని కోరారు. ఆయన సభలో మాట్లాడుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతుండగా.. ‘‘నేను ఏం మాట్లాడుతున్నానో అర్ధం చేసుకోకుండానే మాట్లాడుతున్నారు. అదే మీతో వచ్చిన సమస్య. వెళ్లిపొమ్మంటే వెళ్తాను’’ అంటూ ఘాటుగా బదిలిచ్చారు. అనంతరం మళ్లీ మాట్లాడుతుందగా.. ‘‘ఇదేం సభ.. ఒక్కడిని మాట్లాడుతుంటే ఇంతమంది ఇబ్బంది పెడతారా. నన్ను బెదిరించలేరు’’ అని సమాధానమిచ్చారు. ఆ తరువాత సభలో అందరూ తనకు మిత్రులేనని కూనంనేని తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 04:09 AM