Gajam 1lakh : మోకిలలో గజం లక్ష

ABN , First Publish Date - 2023-08-08T02:27:05+05:30 IST

హైదరాబాద్‌ పశ్చిమంలో భూమి విలువ ఆకాశ మార్గాన పయనిస్తోంది. ఎకరం భూమైనా, చదరపు గజమైనా ఎంత ధర అయినా వెచ్చించి కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తుండడంతో ఇది అత్యంత విలువైన ప్రాంతంగా మారింది. మొన్నటికి మొన్న కోకాపేటలో ఎకరా భూమి వంద కోట్లకు పలికితే.. తాజాగా అక్కడికి 15 కిలోమీటర్ల

Gajam 1lakh : మోకిలలో గజం  లక్ష

హెచ్‌ఎండీఏ లే అవుట్‌లోని ప్లాట్లు హాట్‌ హాట్‌

అమ్ముడుపోయిన 48 ప్లాట్లు

సగటు ధర రూ.80,397 అత్యల్పం రూ.72 వేలు..

అత్యధికం రూ.1.05 లక్షలు

ప్రభుత్వానికి వేలం ద్వారా రూ.121.40 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పశ్చిమంలో భూమి విలువ ఆకాశ మార్గాన పయనిస్తోంది. ఎకరం భూమైనా, చదరపు గజమైనా ఎంత ధర అయినా వెచ్చించి కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తుండడంతో ఇది అత్యంత విలువైన ప్రాంతంగా మారింది. మొన్నటికి మొన్న కోకాపేటలో ఎకరా భూమి వంద కోట్లకు పలికితే.. తాజాగా అక్కడికి 15 కిలోమీటర్ల దూరం; ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మోకిలలో చదరపు గజం లక్ష దాటేసింది. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్‌లో 50 ప్లాట్లను సోమవారం హెచ్‌ఎండీఏ విక్రయించింది. వీటిలో రెండు ప్లాట్లకు చదరపు గజానికి లక్షపైనే పలికింది. ఒక ప్లాటును చదరపు గజం రూ.1.05 లక్షలకు కొనుగోలు చేస్తే.. మరొకదానిని రూ.1,01,500కు దక్కించుకున్నారు. వేలం వేసిన 50 ప్లాట్లలో 48 హాట్‌ హాట్‌గా అమ్ముడుపోయాయి. ఇక్కడ హెచ్‌ఎండీఏ అప్‌ సెట్‌ ధర రూ.25 వేలుగా నిర్ణయిస్తే.. దానికి మూడు నాలుగింతలకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. అత్యల్పంగా చదరపు గజం ధర రూ.72వేలు పలకగా, సగటు ధర రూ.80,397గా నిలిచింది. 48ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది. నిజానికి, గ్రేటర్‌ నుంచి శంకర్‌పల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో గండిపేట తర్వాత గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు అత్యధికంగా మోకిలలోనే ఉన్నాయి. ఐటీ కారిడార్‌కు 10కిలోమీటర్ల దూరం ఉండడం, ట్రాఫిక్‌ రద్దీ లేకపోవడంతో ఐటీ ఉద్యోగులు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే, ఇక్కడ వాక్‌ టు వర్క్‌ కాన్సె్‌ప్టతో టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తే ప్లాట్లు హాట్‌ కేక్‌లా అమ్ముడుపోతాయని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేశారు. ప్రధాన రహదారికి ఆనుకొని 165 ఎకరాలను వాక్‌ టు వర్క్‌ కాన్సె్‌ప్టతో అభివృద్ధి చేస్తున్నారు. అందులో 1,321 ప్లాట్లు రాగా, మొదటి విడతగా 50 ప్లాట్లను సోమవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎ్‌సటీసీ ఈ కామర్స్‌ అనే సంస్థ వేలం వేసింది. తొలుత ఉదయం 25 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించారు. అన్నీ అమ్ముడుపోయాయి. 500 గజాల 242 నంబరు ప్లాట్‌ అత్యధికంగా చదరపు గజం రూ.1.05 లక్షలు పలికింది. 300 గజాల 233 నంబరు ప్లాటు చ.గజం రూ.1,01,500 పలికింది. 266 నంబరు ప్లాట్‌ అత్యల్పంగా రూ.72 వేలకు అమ్ముడుపోయింది. మధ్యాహ్నం మరో 25 ప్లాట్లను వేలం వేశారు. వాటిలో 23 అమ్ముడుపోయాయి. వీటిని చదరపు గజానికి రూ.72 వేల నుంచి రూ.96 వేల మధ్యన కొనుగోలు చేశారు. రెండింటికి సింగిల్‌ బిడ్‌ రావడంతో విక్రయించలేదు. మొత్తంగా 48 ప్లాట్ల ద్వారా 15,800 చ.గజాలను విక్రయించగా ప్రభుత్వానికి రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది. అనూహ్య స్పందన నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీలోపు మరో 200 ప్లాట్లను విక్రయించడానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది.

Updated Date - 2023-08-08T02:27:05+05:30 IST