మంత్రి కొప్పులకు మళ్లీ చుక్కెదురు

ABN , First Publish Date - 2023-08-02T03:58:23+05:30 IST

ఎన్నికల వివాదానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

మంత్రి కొప్పులకు మళ్లీ చుక్కెదురు

తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను

కొట్టివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు

ఒకే కారణంతో రెండోసారి పిటిషన్‌ వేశారన్న ధర్మాసనం

సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి వచ్చారని వెల్లడి’’

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వివాదానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ ఆయన రెండోసారి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. 2019లో దాఖలైన పిటిషన్‌పై ఇన్నేళ్లపాటు విచారణ జరిగి.. కోర్టు కమిషనర్‌ ఆధారాలు కూడా రికార్డు చేసిన తర్వాత.. ఈ దశలో ఆ పిటిషన్‌ను కొట్టేయలేమని, రోజువారీగా దీనిపై తుది విచారణ చేపడతామని స్పష్టంచేసింది. అలాగే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసే సమయంలో పిటిషనర్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌గానీ, ఆయన న్యాయవాదిగానీ లేరని.. వాస్తవాలను పిటిషనర్‌ దాచిపెట్టారని మంత్రి కొప్పుల (ప్రతివాది) ఆరోపిస్తున్న నేపథ్యంలో సదరు వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 86 కింద ప్రతివాది గతంలోనూ తిరస్కరణ పిటిషన్‌ దాఖలు చేశారని.. దానిని ఇదే ధర్మాసనం కొట్టేసిందని.. తమ ఆదేశాలను సుప్రీం సైతం సమర్థించిందని గుర్తుచేసింది. ఈ మేరకు ప్రతివాది మధ్యంతర పిటిషన్‌లో వాదనలు ముగిస్తున్నట్లు పేర్కొన్నది.

ఇదీ నేపథ్యం...

2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ధర్మపురి నుంచి పోటీచేసిన కొప్పుల ఈశ్వర్‌ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌పై 441 ఓట్ల స్వల్పతేడాతో గెలుపొందారు. తన అధికారాన్ని ఉపయోగించి కొప్పుల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని.. తప్పుడు మార్గంలో గెలిచారని.. కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ అడ్లూరి లక్ష్మణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా.. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 86లో ఉన్న ప్రొసీజర్‌ను పిటిషనర్‌ పాటించలేదని, వాస్తవాలను కప్పిపుచ్చారని.. కాబట్టి ఎన్నికల పిటిషన్‌ కొట్టేయాలని మంత్రి కొప్పుల రెండోసారి మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. గత మధ్యంతర పిటిషన్‌లోనూ ఈ వాదన వినిపించారని వ్యాఖ్యానించింది. కొప్పుల పిటిషన్‌ను కొట్టేసి.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2023-08-02T03:58:23+05:30 IST