అవినీతి నిరోధక చట్టం పరిధిపై దిగువ కోర్టు పరిశీలిస్తుంది

ABN , First Publish Date - 2023-07-21T02:52:21+05:30 IST

తెలంగాణలో ఓటు కు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుం దా? లేదా? అన్న విషయాన్ని దిగువ కోర్టు పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అవినీతి నిరోధక చట్టం పరిధిపై దిగువ కోర్టు పరిశీలిస్తుంది

ప్రొసీడింగ్స్‌ను అడ్డుకోకండి

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ

విచారణ ఆగస్టు చివరి వారానికి వాయిదా

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటు కు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుం దా? లేదా? అన్న విషయాన్ని దిగువ కోర్టు పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదని, సాక్షులందరి ఎగ్జామినేషన్‌ పూర్తయిన తర్వాతే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేపట్టాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రివిజన్‌ పిటిషన్‌ స్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆ పిటిషన్‌ విచారణకు రావడం లేదని రేవంత్‌ తరఫు న్యాయవాదులు సమాధానమిచ్చారు. జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీన్‌ రావల్‌.. మూడు సార్లు వాయిదాలు కోరారని తెలిపారు. ‘‘ఎందుకు వాయిదాలు కోరుతున్నారు? ముందు హైకోర్టును నిర్ణయం తీసుకోనివ్వండి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఈ కేసులో అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించవచ్చా? లేదా? అన్నది న్యాయపరమైన ప్రశ్న అని రేవంత్‌ తరఫు న్యాయవాది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరుకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో అవినీతి నిరోధక చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించారు. ‘ఆ విషయాన్ని మేం కాదు, ట్రయల్‌ కోర్టు పరిశీలిస్తుంది. ప్రొసీడింగ్స్‌ను ఈ విధంగా అడ్డుకోకండి’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ఆగస్టు చివరి వారానికి విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అలాగే, ఈ కేసు నుంచి తనను తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2023-07-21T02:52:21+05:30 IST