మహిళా సంక్షేమానికి ఆపన్న ‘హస్తం’

ABN , First Publish Date - 2023-09-15T05:20:09+05:30 IST

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులు సహా మహిళా సంక్షేమానికి కూడా పెద్దపీట వేసే దిశగా పథకాలను కాంగ్రెస్‌ పార్టీ రూపకల్పన చేస్తోంది.

మహిళా సంక్షేమానికి ఆపన్న ‘హస్తం’

నిరుపేద మహిళలకు నెలకు రూ.3వేలు..

ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం

రూ.500 కే వంట గ్యాస్‌ సిలిండర్‌

తుక్కుగూడ సభలో సోనియా ప్రకటించే అవకాశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులు సహా మహిళా సంక్షేమానికి కూడా పెద్దపీట వేసే దిశగా పథకాలను కాంగ్రెస్‌ పార్టీ రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.3 వేలు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, రూ.500 కే వంట గ్యాస్‌ సిలిండర్‌ వంటి హామీలను మేనిఫేస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఈనెల 17న తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభలో ప్రధానంగా ఐదు హామీలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. అయితే హామీల సంఖ్య పెరగనుందని, ఆమె.. ఏడు నుంచి తొమ్మిది హామీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీలన్నీ కూడా రైతులు, కౌలురైతులు, విద్యార్థుల సంక్షేమంతో పాటు ప్రధానంగా మహిళల సంక్షేమంపై ఉండనున్నట్లు తెలిసింది. ‘ఇందిరమ్మ భరోసా’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అందజేస్తున్న రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. అయితే తాము కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని హస్తం పార్టీ హామీ ఇవ్వనుందని తెలిసింది. ఇక రుణమాఫీ కింద రూ.2లక్షల దాకా పంట రుణాన్ని మాఫీని హామీల్లో చేర్చనున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకొస్తే ‘అభయ హస్తం’ పేరుతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామంటూ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ పథకాన్ని కూడా సోనియా ప్రకటించనున్న గ్యారెంటీలలో చేర్చనున్నట్లు సమాచారం. అలాగే చేయూత పేరుతో రూ. 4 వేల పెన్షన్‌ స్కీమ్‌ను ఖమ్మం సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ స్కీమ్‌నూ సోనియా ప్రకటించే గ్యారెంటీల్లో చేర్చనున్నారు. బీసీ, మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే గ్యారెంటీల ఎంపిక పైనా పరిశీలన జరుగుతోంది. శనివారం నాటికి మొత్తం ఎన్ని గ్యారెంటీలను ప్రకటించాలి.. ఏయే గ్యారెంటీలను చేర్చాలన్న దానిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నియోజకవర్గాల వారీగా చార్జి షీట్లు!

17న జయభేరి సభలో సోనియాగాంధీ ప్రకటించే హామీలను, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైన చార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అధిష్ఠానం ఏక కాలంలో చేపడుతున్న సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ విస్తృత సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్‌కు వస్తున్నారు. వీరిలో 119 మంది ముఖ్యనాయకులు 17న రాత్రే తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి ఆ రాత్రి బస చేస్తారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సోనియా ప్రకటించనున్న గ్యారెంటీ బ్రోచర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రూపొందించిన చార్జిషీటునూ ఇవ్వనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన చార్జిషీట్‌ కమిటీ.. గురువారం గాంధీభవన్‌లో సమావేశమై ఈ చార్జిషీటులో ఇంకా చేర్చాల్సిన అంశాలైన సమీక్ష జరిపింది. మైనార్టీలు, దళితులు, తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, అవినీతి అంశాలనూ చేర్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అలాగే నియోజకవర్గ స్థాయి చార్జిషీట్లనూ రూపొందించి.. 18న కార్యక్రమంలో ఆ చార్జిషీట్లనూ పంచాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, స్థానిక సమస్యలనూ ఆ చార్జిషీట్లలో పేర్కొననున్నారు.

ఇంటింటికీ గ్యారెంటీ కార్డు: ఠాక్రే

అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న పార్టీ నాయకులు.. 18న నియోజకవర్గానికి ఒకరు చొప్పున వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించనున్న గ్యారెంటీలతో కూడిన కార్డు పంచనున్నారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌సాగర్‌రావు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల సభలను అధికార పార్టీ అడ్డుకునే సంస్కృతి తెలంగాణలోనే చూస్తున్నామన్నారు.

Updated Date - 2023-09-15T05:20:09+05:30 IST