ఉద్యోగి చేతిలో మోసపోయి యజమాని ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-06-01T01:03:09+05:30 IST

ఉద్యోగి చేతిలో మోసపోయిన ఓ ద్విచక్రవాహన షోరూమ్‌ యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కీమ్‌ పేరిట సేకరించిన రూ.కోటి 90 లక్షలను సదరు ఉద్యోగి కొట్టేయడంతో సబ్బాని నరేష్‌(45) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు.

ఉద్యోగి చేతిలో మోసపోయి యజమాని ఆత్మహత్య

మెట్‌పల్లి, మే 31: ఉద్యోగి చేతిలో మోసపోయిన ఓ ద్విచక్రవాహన షోరూమ్‌ యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కీమ్‌ పేరిట సేకరించిన రూ.కోటి 90 లక్షలను సదరు ఉద్యోగి కొట్టేయడంతో సబ్బాని నరేష్‌(45) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. అంతకంటే ముందు తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియోలో వివరించాడు. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన సబ్బాని నరేష్‌ కథలాపూర్‌లో హీరో బైక్‌ షోరూమ్‌ నిర్వహిస్తున్నాడు. మెట్‌పల్లికే చెందిన గోనె ప్రతాప్‌ కొంతకాలంగా ఆ షోరూమ్‌లో పని చేస్తున్నాడు. ప్రతాప్‌ ఆలోచన మేరకు భవాని ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట నరేష్‌ వాహనాల లక్కీడ్రాను ప్రారంభించాడు. మొదట రెండు స్కీంలు సజావుగా నిర్వహించారు. మరో నాలుగు స్కీంలు నిర్వహణకు కోరుట్లలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఖాతా తెరిచి రూ.కోటి 90 లక్షల వరకు సేకరించారు. ఆ ఖాతాను నరే్‌షకు తెలియకుండా ప్రతాప్‌ తన పేరిట బదలాయించుకున్నాడు. స్కీంలో చేరి డబ్బు కట్టినవారు వాహనాల కోసం ప్రతాప్‌ను సంప్రదించగా.. తనకేం సంబంధం లేదని యజమాని అయిన నరే్‌షనే అడగాలని చేతులెత్తేశాడు. దీంతో డబ్బు కట్టిన వారంతా నరే్‌షను నిలదీశారు. ఈ పరిస్థితుల్లో స్కీం సభ్యులకు డబ్బు చెల్లించలేక, వాహనాలు ఇవ్వలేక నరేష్‌ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నరేష్‌ తనను గోనె ప్రతాప్‌ మోసం చేశాడని సెల్ఫీ వీడియోలో చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేష్‌ భార్యఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-01T01:03:25+05:30 IST