గుడ్డు పోయింది!
ABN , Publish Date - Dec 30 , 2023 | 03:05 AM
మధ్యాహ్న భోజనంలో ఇష్టంగా తినే ఉడకబెట్టిన కోడిగుడ్డు బడి పిల్లలకు కనిపించడం లేదు! ఫలితంగా వారు మొక్కుబడిగా భోజనం చేస్తున్నారు. కొన్నిచోట్ల వారానికి ఒకటి లేదా రెండు రోజుల పాటు అందిస్తుండగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తొలగించారు.
మధ్యాహ్న భోజనంలో కనిపించని కోడి గుడ్డు
ధరలు పెరగడంతో పలుచోట్ల నిలిపివేత
పోషకాహారం పరంగా విద్యార్థులకు సమస్య
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనంలో ఇష్టంగా తినే ఉడకబెట్టిన కోడిగుడ్డు బడి పిల్లలకు కనిపించడం లేదు! ఫలితంగా వారు మొక్కుబడిగా భోజనం చేస్తున్నారు. కొన్నిచోట్ల వారానికి ఒకటి లేదా రెండు రోజుల పాటు అందిస్తుండగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తొలగించారు. గుడ్డు ఎందుకు మాయమైంది? అనే ప్రశ్నకు ధరలు పెరగడమేనన్న సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వారానికి మూడు రోజుల పాటు ఉడికించిన కోడి గుడ్డును విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఈ గుడ్ల కోసం ఒక్కో విద్యార్థిపైన రోజుకు రెండు రూపాయాల చొప్పున వారానికి పన్నెండు రూపాయాలను కాంట్రాక్టర్‌కు చెల్లించనున్నారు. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో కోడి గుడ్డు ధరలు రూ. 6 నుంచి రూ. 6.50ల వరకు ఉన్నాయి. ఈ ధరల ప్రకారం వారానికి రెండు సార్లు కూడా విద్యార్థులకు కోడి గుడ్లను అందించే అవకాశం లేదు. దాంతో చాలా స్కూళ్లల్లో కోడి గుడ్ల సంఖ్యను తగ్గించడమో, లేదంటే వారానికో రోజు అందించడమో, పూర్తిగా మానేయడమో చేస్తున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు కూడా పేరుకుపోవడంతో తాము అప్పులు చేసి భోజనం పెడుతున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ దశలో కోడి గుడ్ల ధరలు పెరగడం వల్ల కూడా సమస్యను మరింత తీవ్రం చేసింది.
స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలి.. భట్టిని కోరిన హెచ్‌ఎంల సంఘం
పేద ప్రజలకు, రైతులకు ఇస్తున్నట్టుగానే ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఉచితంగా విద్యుత్తు సరఫరాను చేయాలని రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ విద్యుత్తు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మంత్రిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. స్కూల్ గ్రాంట్ సరిపడా లేని సమయంలో విద్యుత్తు బిల్లులను చెల్లించడం కష్టం అవుతుందని వారు చెప్పారు.