కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్
ABN , First Publish Date - 2023-12-11T03:01:45+05:30 IST
బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల తరువాత.. వేటు కార్పొరేషన్ల చైౖర్మన్లపై పడింది. ఏకకాలంలో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
ఏకకాలంలో 54 మంది నియామకాలు రద్దు
ఉన్నత విద్యామండలి, మీడియా అకాడమీసహా
నామినేటెడ్ చైర్మన్ల మూకుమ్మడి తొలగింపు
వారు నియమించుకున్న వ్యక్తిగత సిబ్బంది కూడా
అంతా బీఆర్‌ఎస్ హయాంలో నియమితులైన వారే
పేషీల్లో పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీలుగా ఉన్న
ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్ల డిప్యుటేషన్లూ రద్దు
జీవో జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల తరువాత.. వేటు కార్పొరేషన్ల చైౖర్మన్లపై పడింది. ఏకకాలంలో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం జీవో (ఆర్టీ నంబరు 1624) జారీ చేశారు. నియామకాలు రద్దయిన వారిలో మీడియా అకాడమీ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, మార్క్‌ఫెడ్, రైతుబంధు, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, నీటి వనరుల అభివృద్ధి సంస్థ వంటి కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. వీరితోపాటు వీరు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో నియమించుకున్న వ్యక్తిగత సిబ్బందిని కూడా తొలగిస్తున్నట్లు సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. పలు పేషీల్లో పీఏలుగా, పీఎ్‌సలుగా, ఓఎస్డీలుగా చేరిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పోస్టింగులు, డిప్యుటేషన్లనూ రద్దు చేశారు. వారిని ఎవరి సొంత శాఖలకు వారు వెళ్లిపోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. నామినేటెడ్ పోస్టుల నియామకం చేపడుతుంది. రాజకీయంగా అవకాశాలు రానివారికి, పదవులు దక్కని నేతలకు, పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ.. వంటి పదవులు ఇవ్వడం కుదరని వారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వెంట సన్నిహితంగా తిరిగే వారికి, నేతల అనుయాయులకు నామినేటెడ్ పదవులను కట్టబెడుతుంటారు. ఇందులో భాగంగానే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా నామినేటెడ్ పదవుల పందేరాన్ని చేపట్టింది.
పార్టీ నేతల కోసం పదవుల పందేరం!
సాధారణంగా కార్పొరేషన్ల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. అయితే ప్రభుత్వ పెద్దలు దానిని పొడిగించాలనుకుంటే పొడిగిస్తుంటారు. లేదా కొత్తవారికి అవకాశం కల్పిస్తుంటారు. కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ పదవుల పందేరం చాలా విచిత్రంగా జరిగింది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు నియమిస్తారో కూడా తెలియకుండా జరిగింది. ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో రాజకీయంగా లబ్ధి పొందడానికి కూడా పదవుల పందేరం చేపట్టారు. ఉదాహరణకు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కోడ్’ అమల్లోకి రావడానికి ఒకటి, రెండు రోజుల ముందు కూడా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. రైతుబంధు సమితి చైర్మన్ తాటికొండ రాజయ్య, టీఎ్‌సఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డిల నియామకాలు కూడా ఇలాగే జరిగాయి. వీరు బాధ్యతలు స్వీకరించిన మరుసటిరోజే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాగా, తాజాగా రద్దు చేసిన కార్పొరేషన్ల చైర్మన్లలో కొందరు సుదీర్ఘకాలంగా పదవుల్లో ఉన్నారు. మరికొందరు స్వల్ఫ వ్యవధిలోనే పదవులు కోల్పోవాల్సివచ్చింది.