పసిప్రాణాలను కాపాడిన బ్రిటన్ వైద్య బృందం
ABN , First Publish Date - 2023-03-05T03:28:56+05:30 IST
నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(నిమ్స్) ప్రభుత్వ ఆస్పత్రి అరుదైన ఘనతకు వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు బ్రిటన్ నుంచి వచ్చిన వైద్యుల బృందం..
తొమ్మిది మంది చిన్నారులకు నిమ్స్‌లో విజయవంతంగా గుండె సర్జరీలు ..
వైద్యులకు మంత్రి హరీశ్ అభినందన
సనత్‌నగర్/హైదరాబాద్ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(నిమ్స్) ప్రభుత్వ ఆస్పత్రి అరుదైన ఘనతకు వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు బ్రిటన్ నుంచి వచ్చిన వైద్యుల బృందం.. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తొమ్మిది మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేసింది. ఈ బృందం సర్జరీ చేసిన వారిలో ఎక్మో మీద ఉన్న ఓ చిన్నారి, మూడు నెలల వయసు రెండున్నర కిలోల బరువున్న పాప కూడా ఉన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన డాక్టర్ వెంకటరమణ దన్నపనేని బృందం నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రులకు చెందిన వైద్యులతో కలిసి అత్యంత క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సలను చేసింది. 20 మంది వైద్యుల బృందం ఒక్కో శస్త్రచికిత్స కోసం నాలుగు నుంచి ఐదు గంటలపాటు శ్రమించింది. ఈ మేరకు శనివారం నిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. తొమ్మిది పసిప్రాణాలను కాపాడిన బ్రిటన్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలియజేసి సత్కరించారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వైద్యులందరూ డాక్టర్ వెంకటరమణ మాదిరిగానే సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న తొమ్మిది మంది చిన్నారులను పరామర్శించారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. బ్రిటన్ వైద్య బృందం అద్భుతం చేసిందన్నారు. గతంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేయించారని.. ఇప్పుడు ఆ ఘనత నిమ్స్‌కు దక్కిందన్నారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది పిల్లలు పుడుతుంటే వారిలో 5400 మంది గుండె జబ్బులు ఉంటున్నాయని, వారిలో వెయ్యి మందికి శస్త్రచికిత్స అవసరం పడుతుందని తెలిపారు. శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు భరించే శక్తి తల్లిదండ్రులకు లేకపోవడంతో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇలాంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. వరంగల్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దసరా నాటికి సిద్ధమవుతుందని హరీశ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా మరిన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకోని నిమ్స్‌లో కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం 32 ఎకరాలను ప్రభుత్వ భూమిని కేటాయించామని చెప్పారు. దీని వల్ల మరో రెండు వేల పడకలు అందుబాటులోకి వస్తాయని హరీశ్ వెల్లడించారు.