Share News

శరీరాలు ముక్కలై...

ABN , First Publish Date - 2023-10-31T03:42:24+05:30 IST

ఎటూ చూసినా ఆర్తనాదాలు..ఎవరిని తట్టినా కన్నీటి గాథలే. జీవనోపాధి కోసం కొంతమంది.. శుభకార్యాల నిమిత్తం వెళ్లినవారు కొందరు! గమ్యస్థానాలకు చేరకముందే ఆదివారం రాత్రి ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటికాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వారంతా మృత్యుఒడికి చేరిపోయారు. వారిలో ఎక్కువమంది నిరుపేదలే. కూలినాలీ చేసుకుని జీవించేవారు.

శరీరాలు ముక్కలై...

రైలు ప్రమాదంలో 2 భాగాలుగా విడివడ్డ లోకో పైలట్‌ దేహం

నుజ్జయిన బోగీల్లో ఛిద్రమైన మృతదేహాలు

ఆప్తుల ఆర్తనాదాలు.. ఆస్పత్రుల్లో హృదయవిదారక దృశ్యాలు

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎటూ చూసినా ఆర్తనాదాలు..ఎవరిని తట్టినా కన్నీటి గాథలే. జీవనోపాధి కోసం కొంతమంది.. శుభకార్యాల నిమిత్తం వెళ్లినవారు కొందరు! గమ్యస్థానాలకు చేరకముందే ఆదివారం రాత్రి ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటికాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వారంతా మృత్యుఒడికి చేరిపోయారు. వారిలో ఎక్కువమంది నిరుపేదలే. కూలినాలీ చేసుకుని జీవించేవారు. మృతదేహాలను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అవి గుర్తుపట్టలేనివిధంగా ఉన్నాయి. నుజ్జునుజ్జుగా మారిన మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. బోగీలు నుజ్జవడంతో శరీరాలు చిదురు చిదురయ్యాయి. పలాస ప్యాసింజరును వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ ప్యాసింజర్‌ లోకో పైలెట్‌ సింగంపల్లి మధుసూదనరావు (53) శరీరం ముక్కలు, ముక్కలుగా విడిపోయింది. ఆయన మృతదేహంలో కొంతభాగం అదివారం రాత్రి, మిగిలిన భాగం సోమవారం ఉదయం రైల్వే అధికారులు బయటకు తీశారు. ఈ రెండుభాగాలకు పోస్టుమార్టం నిర్వహించి అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం తంగేడు నుంచి వచ్చిన ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదే ప్రమాదంలో మరణించిన పలాస పాసింజర్‌ గార్డు మరిపి శ్రీనివాసరావు (53) మృతదేహాన్ని విశాఖ నగరంలోని ఆరిలోవకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు రైల్వే ఉద్యోగులు, పది మంది ప్రయాణికులు మృతి చెందినట్టు గుర్తించారు. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మారారు. తీవ్రంగా గాయపడినవారిని విశాఖపట్నం కింగ్‌జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో విజయనగరం జిల్లా జామికి చెందిన నల్ల కుమారికి ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతినడంతోపాటు గుండె భాగంలో ఎముకలు చిట్లాయి. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన ఎం.లక్ష్మికి తుంటి ఎముక పై భాగంలో గాయమైంది. ఈమె పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. బయటకు కనిపించని గాయాలతో ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.వరలక్ష్మికి, అదే జిల్లాకు చెందిన గొట్ట కమలమ్మకు ఆర్థో విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఇక స్వల్పంగా గాయపడిన వారిని విజయనగరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో భద్రపరిచారు. కాగా, ఈ ప్రమాదంలో 14 మంది మరణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మృతుల్లో నలుగురు రైల్వే సిబ్బంది ఉన్నారు. రెండు మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. మరోవైపు, ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాక్‌ను అధికారులు 19 గంటల్లో పునరుద్ధరించారు.

Updated Date - 2023-10-31T03:42:24+05:30 IST