బ్యాట్ పట్టింది లేదు.. బంతిని కొట్టింది లేదు
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:56 PM
మేడ్చల్‌లో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మినీ స్టేడియం గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణంలోని పారిశ్రామికవాడ సమీపంలో 20 ఏళ్లక్రితం టీడీపీ హయాంలో అప్పటి మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ ప్రత్యేక చొరవతో మినీస్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఏ ముహూర్తంలో పనులు ప్రారంభించారో గానీ ప్రభుత్వాలు మారినా..ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా మినీస్టేడియం పరిస్థితి మాత్రం మారలేదు.
20 ఏళ్లు దాటిన నెరవేరని క్రీడాకారుల కల
నిరుపయోగంగా మేడ్చల్ మినీ స్టేడియం
పశువుల కొట్టంలా వాడుకుంటున్న కాపరులు
మేడ్చల్ టౌన్, డిసెంబరు 26 : మేడ్చల్‌లో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మినీ స్టేడియం గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణంలోని పారిశ్రామికవాడ సమీపంలో 20 ఏళ్లక్రితం టీడీపీ హయాంలో అప్పటి మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ ప్రత్యేక చొరవతో మినీస్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఏ ముహూర్తంలో పనులు ప్రారంభించారో గానీ ప్రభుత్వాలు మారినా..ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా మినీస్టేడియం పరిస్థితి మాత్రం మారలేదు. ఎన్నికల ముందు మినీస్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు క్రీడా మైదానం అందుబాటులోకి తీసుకొస్తామని నేతలు హామీ ఇచ్చి కాలం వెళ్లదీస్తూ వచ్చారే తప్పా, మినీ స్టేడియం అందుబాటులోకి తెచ్చిన పాపాన పోలేదు. దీంతో మినీ స్టేడియం క్రీడాకారులకు అందని ద్రాక్షలా మారింది. ప్రస్తుతం మేడ్చల్ కొత్త పట్టణంలో ఆడుకోవటానికి ఆట స్థలం లేక స్థానిక యువకులు ఖాళీ మైదానాల్లో ఆడుతున్నారు. ఇక బ్యాట్ మెంటన్, షెటిల్, క్రికెట్ ఆటల కోసం ప్రత్యేకంగా కొందరు ప్రైవేటు వ్యక్తులు స్టేడియాలు తయారు చేసి అద్దెకు ఇవ్వటంతో రక్రీడాకారులు డబ్బులు చెల్లించి మ్యాచ్‌లు ఆడుతున్నారు.
హల్‌చల్ చేసిన ఎమెల్యే
గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హుటాహుటీన అప్పటి మంత్రి కేటీఆర్‌తో మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్న స్టేడియం గ్యాలరీలకు రంగులు వేసి, మైదానంలో పిచ్చిమొక్కలను తొలగించి చదును చేశారు. కేటీఆర్ ప్రారంభించటంతో స్టేడియం దశ...దిశ మారుతుందని భావించిన క్రీడాకారులకు తిరిగి నిరాశే మిగిలింది. కేటీఆర్ ప్రారంభించి వెళ్లిన అనంతరం అక్కడ ఒక్క పని చేయక పోగా అటు వైపు కనీసం అధికారులు, ప్రజాప్రతినిఽధులు కన్నెత్తి చూడడం లేదు. ముచ్చటగా మూడు ప్రభుత్వాలు మారినా మినీ స్టేడియం పరిస్థితి మాత్రమం మారడం లేదు.
అ సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా...
మినీ స్టేడియాన్ని వినియోగంలోకి తేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనికి తోడు కొందరు పశువుల కాపరులు గ్యాలరీని పశువుల కొట్టంలా వాడుకుంటున్నారు. స్టేడియం పరిసరాల్లో పెంటకుప్పలు, ఖాళీ మందు బాటిళ్లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం కాగానే మద్యం ప్రియులు, గంజాయి గ్యాంగులు స్టేడియం వద్దకు చేరుకుని జల్సా చేసి వెళ్తున్నారు. స్టేడియంలో నిర్మించిన గదుల్లో కొందరు పశువుల కాపరులు యథేచ్ఛగా పశువులను కట్టేసి వెళ్తున్నారు.
మినీ స్టేడియం ఉన్న విషయమే మరిచి పోయాం
మేడ్చల్‌లో మినీ స్టేడియం ఉన్న విషయాన్ని క్రీడాకారులు మరిచి పోయారు. స్టేడియం అందుబాటులోకి వస్తుందని 20ఏళ్లుగా ఎదురు చూసి చాలించుకున్నాం. అడుకోవటానికి క్రీడా మైదానం లేక క్రీడాకారుల ఇబ్బందులు పడుతున్నా నేతలు పట్టించుకోలేదు. ఇకపై స్టేడియం ప్రారంభమవుతుందన్న ఆశ కూడా క్రీడాకారులకు లేదు.
- ఎండీ మన్సూర్, క్రికెట్ కోచ్
కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలి
20ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియాన్ని అందుబాటులోకి తేవాలి. ఆడుకోవడానికి వైదానం లేకపోవడంతో క్రీడాకారుల నైపుణ్యం నీరుగారిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలి. స్టేడియం నిర్వాహణ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించాలి.
-బడ్త నరేష్ కుమార్, క్రీడాకారుడు