Pawan Kalyan : జనసేన-టీడీపీ కలిసి పోటీచేసి గెలవడమే లక్ష్యం
ABN , First Publish Date - 2023-10-03T03:52:45+05:30 IST
తాను సీఎం అవుతానా లేదా అన్నది ముఖ్యం కాదని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన..
నేను సీఎం కావడం ముఖ్యం కాదు
ఫలితాలొచ్చాక అధికారంపై మాట్లాడదాం
సీఎం పదవిపై పంతాలకు పోవద్దు
జగన్‌ను మళ్లీ గెలిపిస్తే డ్రాకులాలా రక్తం తాగేస్తాడు: పవన్ కల్యాణ్
మచిలీపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తాను సీఎం అవుతానా లేదా అన్నది ముఖ్యం కాదని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన.. టీడీపీ కలిసి పోటీచేసి గెలుపొందడమే ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు. ‘ఈసారి జరిగే ఎన్నికలు అమీతుమీ యుద్ధమే. మనమే గెలుస్తాం’ అని జనసైనికులకు భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో పార్టీ నాయకులతో ఆయన అంతర్గత సమావేశం నిర్వహించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీచేస్తాయని పునరుద్ఘాటించారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక అధికారం ఎవరికి అందుతుందనే అంశంపై మాట్లాడుకుందామని చెప్పారు. జనసైనికులు సీఎం పదవిపై పంతాలకు పోకుండా కలిసి సాగాలన్నారు. ఒక్క సామాజిక వర్గం మద్దతుతో అధికారం రాదన్న విషయం గ్రహించాలని సూచించారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే డ్రాకులా మాదిరిగా ప్రజల రక్తం తాగేస్తాడని హెచ్చరించారు. ఆయన వద్ద ప్రైవేటు సైన్యం ఉందని, గతంలో బెంగుళూరులో ఎస్‌ఐ స్థాయి అధికారిని కొట్టి స్టేషన్‌లో ఉంచిన ఘనత వారికుందన్నారు.
వ్యతిరేక ఓటు చీలకుండా..
జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నామని పవన్ చెప్పారు. స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన, టీడీపీ గ్రామాల్లో పోటీచేసి విజయం సాధించాయని గుర్తు చేశారు. కులాన్ని కాంక్షించే వారు దేశ భవిష్యత్‌ను కాపాడలేరని, కుల మత ప్రస్తావన లేని పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు.