15 thousand per year : రైతు భరోసా పదెకరాలకే!
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:43 AM
రైతుబంధు పథకం రైతులకు వరమే అయినా, ఆ పథకం ద్వారా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఎందరో అనర్హులకు ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్నారని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో...
7350 కోట్లుసాయాన్ని రూ.15 వేలకు పెంచడం వల్ల పడే అదనపు భారం
అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే..
రాష్ట్రంలోని ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం
70లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం
ఎకరానికి రూ.5 వేల నుంచి 7,500కు పెంపు
రెండు పంటలకూ కలిపి ఏడాదికి రూ.15 వేలు
వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు
ఈ సీజన్‌కు పరిమితులు లేకుండానే పంపిణీ
రైతుబంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్
పరిమితి పెట్టినా, సాయం పెంపుతో ఆర్థిక భారమే
కటాఫ్‌తో సాయం ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే
బీడు, రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములపై సర్వే
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకం రైతులకు వరమే అయినా, ఆ పథకం ద్వారా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఎందరో అనర్హులకు ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్నారని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో... కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం(ఖరీఫ్) సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితి(కటా్‌ఫ)తో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా.. పది ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే.. 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది. మిగతా ఐదెకరాలకూ రాదు. అలాగే.. ఇప్పటిదాకా ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు పంపిణీ చేస్తుండగా.. వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున... ఏడాదికి రూ.15 వేల చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిసింది. రైతుభరోసా పథకానికి పరిమితులు విధించినా లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులుండగా.. వీరందరికీ రైతుభరోసా అందుతుంది. రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే పదెకరాల పరిమితి పెడితే... 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. అంటే కటాఫ్ విధించటం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.150 కోట్లు తగ్గుతుంది. కానీ ఇప్పటివరకూ ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచటంతో.. 50 శాతం ఆర్థిక భారం పెరుగుతుంది. ఒక లక్ష ఎకరాలకు మినహాయించి.. 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీచేయాలంటే... ఏడాదికి రూ. 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటివరకూ రైతుబంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు రూ.15 వేల కోట్లు. అంటే, ఇకపై రూ.7,350 కోట్ల మేర ఆర్థికభారం పెరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు తీయటంలో నిమగ్నమైనట్లు సమాచారం.
2018 నుంచి..
రైతుబంధు పథకాన్ని 2018 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున ఎకరానికి 8 వేలు ఇచ్చారు. రెండు సీజన్లు గడిచిన తర్వాత ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచి, ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అయితే రైతుబంధు పంపిణీకి అప్పటి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ విధించలేదు. రైతు పేరు మీద ఎంత భూమి ఉంటే అంత భూమికీరైతుబంధు ఇస్తూ వస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకంటే.. భూమి ఎక్కువ ఉన్నవారికే లబ్ధి ఎక్కువ జరుగుతోందనే విమర్శలు ఐదేళ్లుగా వస్తున్నాయి. రైతుసంఘాలు, ప్రజాసంఘాలు, వ్యవసాయ విశ్లేషకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రైతుబంధుకు కొంత పరిమితి విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంఽధు పథకాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. రైతుభరోసా పేరుతో ఎకరానికి రూ. 7,500 చొప్పున పంపిణీ చేయాలని, అదే క్రమంలో కటాఫ్ విధించాలని నిర్ణయించింది. అయితే.. కటా్‌ఫను 5 ఎకరాలుగా పెట్టాలా? లేక 10 ఎకరాలా? అనే అంశం పై ప్రభుత్వంలో చర్చ జరగ్గా.. 10 ఎకరాల కటా్‌ఫతో ముందుకెళ్లాలనే అభిప్రాయమే మెజారిటీగా వచ్చినట్టు సమాచారం. దీంతో.. రైతులకు ఎంత భూమి ఉన్నా ‘రైతుభరోసా’ కింద అందించే సాయాన్ని పదెకరాలకు పరిమితం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఆ భూములపై సర్వే
ప్రతి సీజన్‌లో కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం కోటిన్నర ఎకరాలు ఉండట్లేదు. వానాకాలంలో కోటి ఎకరాలు దాటుతున్నా యాసంగిలో 75 లక్షల ఎకరాలే. అయితే, ప్రభుత్వం మాత్రం మొత్తం విస్తీర్ణానికీ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో సాగుకు యోగ్యం లేని, రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములు, వెంచర్లు, ఫామ్ హౌజ్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 18.56 లక్షల ఎకరాలు శాశ్వత బీడు. ‘సీసీఎల్‌ఏ’ ఇచ్చిన వ్యవసాయ భూముల జాబితాలో, ధరణిలో, పాస్ పుస్తకాల్లో ఈ భూమి విస్తీర్ణం నమోదై ఉండటంతో వ్యవసాయం లెక్కలోకే వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్- మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ‘నాలా’ కన్వర్షన్ కాకుండా సాగు జాబితాలో ఉన్న అతి ఖరీదైన భూములకు సైతం రైతుబంధు అందుతోంది. రియల్టర్ల చేతుల్లో ఉన్న, వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లకు సైతం రైతుబంఽధు అందుతుండటంపై విమర్శలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా రైతుబంధు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులలో కొందరికి భూములు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి భూములన్నింటిపై సర్వే నిర్వహించాలని, రెవెన్యూ- వ్యవసాయశాఖ అధికారులతో బృందాలు తయారుచేసి... క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని, వ్యవసాయభూముల లెక్కలు పక్కాగా తేల్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.