అమెరికాలోని తెలుగువారికే మాతృభాషపై మక్కువ
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:50 AM
దేశంలో ఉంటున్న వాళ్లకంటే అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లకే మాతృభాషపై మమకారం ఎక్కువని పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి ఆటా, తానా కృషి చేయాలి
ఆటా సాహితీ సదస్సులో ఆచార్య కొలకలూరి ఇనాక్
తప్పుడు వార్తలు ఎక్కువ నమ్మేది విద్యావంతులే : ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉంటున్న వాళ్లకంటే అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లకే మాతృభాషపై మమకారం ఎక్కువని పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి ఆటా, తానా వంటి తెలుగు సంఘాలు కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సును ఐనాక్ ప్రారంభించి ఉపన్యసించారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉందని ఆటా ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు వెలుగుతోందని చెప్పడానికి గర్విస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలుగులో ఓ సాహిత్య పత్రికను తీసుకువచ్చేందుకు ఆటా చొరవ తీసుకోవాలని కోరారు. తెలుగు భాషాభివృద్ధికి ఆటా చేస్తున్న కృషిని ఆటా లిటరరీ కమిటీ అధ్యక్షుడు నక్షత్రం వేణు, ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ సందర్భంగా వివరించారు. కాగా, కార్యక్రమంలో భాగంగా ‘ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియా రంగం’ అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కే శ్రీనివాస్ ‘నూతన మాధ్యమాలు - సత్యాసత్యాలు’ అంశంపై మాట్లాడారు. ఎంతోమంది ఆలోచనలను ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాలు కొన్నిసార్లు హింసకు కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలను విశ్వసించే వారిలో విద్యావంతులు అధికంగా ఉండడం బాధాకరం అన్నారు. తప్పుడు వార్తలకు సంబంధించి గతేడాది దేశ వ్యాప్తంగా 97 కేసులు నమోదైతే అందులో 57 తెలంగాణ నుంచి ఉన్నాయని ప్రస్తావించారు. ఫేక్ న్యూస్‌ను షేర్ చేస్తున్న వారిలో 40ు దక్షిణాది వారు ఉండటం శోచనీయం అన్నారు. డిజిటల్ రూపంలో లేని అసెంబ్లీ సమావేశాల పాత ప్రొసీడింగ్స్ పుస్తకాలు, అలనాటి తెలుగు పత్రికల ఆర్కైవ్స్ వెబ్‌సైట్‌లను ప్రభుత్వం పునరుద్ధరించాలని చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి వ్యాఖ్యాత ఐనంపూడి శ్రీలక్ష్మి, కాసుల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.