సోనియా రాకతో తెలంగాణ పునీతం

ABN , First Publish Date - 2023-09-18T04:09:35+05:30 IST

సోనియా గాంధీ మాట తప్పని, మడమ తిప్పని నేత అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు.

సోనియా రాకతో తెలంగాణ పునీతం

రాష్ట్ర ప్రజల భవితకు గ్యారెంటీ ఇచ్చేందుకే వచ్చారు

విజయభేరి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌

ఆమె మాట తప్పని, మడమ తిప్పని నేత: రేవంత్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సోనియా గాంధీ మాట తప్పని, మడమ తిప్పని నేత అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్రజల బాధ, దుఃఖం చూడలేకనే ఆమె ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని చెప్పారు. విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మలి దశ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల ఆత్మబలిదానాలతో సోనియా చలించిపోయారన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంతటి బాధ ఉంటుందో తెలిసిన సోనియా.. బలిదానాలను చూసి తట్టుకోలేకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు నాడు హామీ ఇచ్చిన సోనియా, మళ్లీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని సంక్షేమ, అభివృద్ధి బాటలో నడిపేందుకు ఈ గడ్డపై కాలు మోపారని.. ఆమె రాకతో తెలంగాణ రాష్ట్రం పునీతమైందని అన్నారు.

హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సభ పెట్టుకుందామంటే అమిత్‌ షా అడ్డుపడ్డారని, గచ్చిబౌలి స్టేడియంలో సభ పెట్టుకునేందుకు అనుమతి కోరితే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. చివరకు తుక్కుగూడలో సభకు స్థలం చూస్తే అవి దేవుని భూములంటూ అనుమతి నిరాకరించారని, చివరకు ఇక్కడ రైతులు సభకు స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వారందరికీ రుణపడి ఉంటామని తెలిపారు. తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసానికి గురిచేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, ఉద్యమకారులు, మహిళలు, మైనారిటీలు, నిరుద్యోగులు దగాపడ్డారని చెప్పారు. కాగా, విజయభేరి సభలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయని వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రసంగాన్ని ఆయన తెలుగులో అనువదించారు. తెలంగాణ ప్రజల కోసం తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాయన్నారు. కాగా, బోయినపల్లిలో నిర్మించనున్న రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌కు విజయభేరి సభ నుంచే సోనియా శంకుస్థాపన చేశారు.

Updated Date - 2023-09-18T04:10:58+05:30 IST