సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2023-08-21T04:43:18+05:30 IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ కాంగ్రె్‌సకు ఆ పార్టీ అధిష్ఠానం మంచి ఊపునిచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీలో అత్యున్నతమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఇద్దరు నేతలకు చోటు కల్పించింది.
ఈసారి ఇరువురు నేతలకు చోటు
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ కాంగ్రె్‌సకు ఆ పార్టీ అధిష్ఠానం మంచి ఊపునిచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీలో అత్యున్నతమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఇద్దరు నేతలకు చోటు కల్పించింది. రాష్ట్రంలో ఎస్సీల్లో అతి పెద్ద సామాజిక వర్గమైన మాదిగ కులానికి చెందిన తమకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత దక్కడం లేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతున్న వేళ.. అదే వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు శాశ్వత ఆహ్వానితుడిగా చోటు కల్పించింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిని ఎంపిక చేసింది. గతంలో సీడబ్ల్యూసీలో తెలంగాణ ప్రాంతం నుంచి కె.కేశవరావుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు దక్కింది. ఆయన బీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత.. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ అవకాశం లభించలేదు. సుదీర్ఘ కాలం తర్వాత దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డిలకు చోటు కల్పించారు. కాగా, ఈసారి సీడబ్ల్యూసీలో ఎక్కువ మంది తెలంగాణ నాయకులకు చోటు కల్పించాలని భావించిన అధిష్ఠానం.. తొలుత పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కల పేర్లను పరిశీలించింది. అయితే ఇద్దరిలో ఒకరికే చోటు కల్పించాల్సి రావడం, ఒకరిని కాదని మరొకరికి ఇస్తే రాష్ట్ర పార్టీలో కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశముండటంతో ఆ రెండు పేర్లనూ అధిష్ఠానం పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ఆ స్థానంలో దామోదర రాజనర్సింహను ఎంపిక చేసింది. మరోవైపు, చట్టసభల్లో అసలు ప్రాతినిధ్యమే లేని ఏపీ కాంగ్రెస్ నుంచి నలుగురికి చోటు కల్పించడం గమనార్హం.