TS News: ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-01-29T17:02:40+05:30 IST

ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

TS News: ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం

హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బహుళ సమాధానాలు ఉన్న 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారి జాబితాను ఈ నెల 30 నుంచి వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్‌లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలున్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మార్కులు వేసి ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్‌లను పరిశీలించిన కోర్టు బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేయడం ద్వారా మరికొందరు అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు (పార్ట్‌-2కు) ఎంపికయ్యే అవకాశం ఉన్నది. ఇలా అదనంగా దేహదారుఢ్య పరీక్షలకు (పార్ట్‌-2కు) ఎంపికయ్యే అభ్యర్థుల వివరాలను రేపట్నుంచి వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు బోర్డు తెలిపింది. హాల్‌ టికెట్‌ నంబర్లతోనే అభ్యర్థులు లాగిన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1 నుంచి పార్ట్‌-2 దరఖాస్తులు ప్రారంభమవుతాయని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 5 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పార్ట్‌-2కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 రాత్రి 12 గంటల వరకు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది.

Updated Date - 2023-01-29T17:42:22+05:30 IST