SUN BURN: నిప్పులు కురిపిస్తున్న సూరీడు!

ABN , First Publish Date - 2023-06-02T02:35:48+05:30 IST

రాష్ట్రంలో రోహిణి ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలాడుతున్నాడు.

SUN BURN: నిప్పులు కురిపిస్తున్న సూరీడు!

సూర్యాపేట జిల్లా లక్కవరంలో 45.2

అక్కడక్కడ వడగండ్ల వానలు..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో రోహిణి ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలాడుతున్నాడు. ఎండ వేడి, వడగాలుల తీవ్రతతో జనం విలవిలలాడారు. సాయంత్రానికి అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా లక్కవరం రోడ్‌లో అత్యధికంగా 45.2, జగిత్యాల జిల్లా జైనాలో 45.1, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు మండాయి. పలుచోట్ల 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నగరంలో మూడ్రోజుల వరకు ఎండల తీవ్రత ఉండే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5 తర్వాత నుంచి వాతావరణం చల్లబడుతుందని వెల్లడించింది. ఇక నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లికి చెందిన రైతు పోలేని లక్ష్మయ్య (57), సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ కొండ పుల్లమ్మ (41) వడదెబ్బతో మరణించింది.

ఈదురుగాలులు.. వడగండ్లు!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. దీంతో మామిడి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు, తూకం వేసిన బస్తాలు తడిశాయి. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. అడ్డాకుల మండలం వర్నె గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్‌సాగర్‌ (30), బంధువైన ఉప్పరి గోపాల్‌తో కలిసి బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా పోతులమడుగు గ్రామ శివారులో వర్షం మొదలవడంతో ఓ చెట్టు కింద ఆగారు. ఆ చెట్టుపైనే పిడుగుపడటంతో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాల్‌కు గాయాలయ్యాయి.

Updated Date - 2023-06-02T03:02:42+05:30 IST