టార్గెట్ 10 సీట్లు
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:51 AM
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పది సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
లోక్‌సభ ఎన్నికల కోసం
తెలంగాణపై బీజేపీ దృష్టి
ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి
మల్కాజిగిరి టికెట్ కోసం నేతల పోటీ
ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశావహులు
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పది సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 80 వేల నుంచి లక్ష వరకు ఓట్లు ఎక్కువ వచ్చిన సెగ్మెంట్లపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లెక్కన 10 ఎంపీ స్థానాల్లో గట్టి ప్రయత్నాలు చేసి వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. మిగతా ఎంపీ స్థానాలను రెండో కేటగిరీలో చేర్చింది. మొదటి ప్రాధాన్యంలో ఉన్న 10 ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని భావిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్‌ఛుగ్ ఇప్పటికే ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ఆ సందర్భంగా పది కీలక సెగ్మెంట్లపై దిశానిర్దేశం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీలో మల్కాజ్‌గిరి టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. బీ ఫాం తనకే వస్తుందని సీనియర్ నేత చాడ సురేశ్‌రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్న తనకు అధినాయకత్వం ఈసారి అవకాశం ఇస్తుందని నమ్ముతున్నారు.
సురేశ్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు బీజేపీ నాయకత్వాన్ని కోరారు. గత ఎన్నికల్లో బరిలో నిలిచిన సీనియర్ నేత ఎన్.రాంచందర్‌రావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్‌తో పాటు సీనియర్ నాయకులు మల్లారెడ్డి, మురళీధర్‌రావు తదితరులు కూడా ఈ సీటు కోసం పోటీపడుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తానని జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ కూడా ప్రకటించారు. భువనగిరి టికెట్‌ను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. మనోహర్‌రెడ్డి కోరుతున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. జహీరాబాద్ టికెట్‌ను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి, వడ్డేపల్లి సుభా్‌షరెడ్డి ఆశిస్తున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌తో పాటు, ఎం. జైపాల్‌రెడ్డి, చీకోటి ప్రవీణ్ కూడా బీ ఫాం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ టికెట్ కోసం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పట్టుబడుతున్నారు.
బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి టికెట్‌ను ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఆశిస్తున్నారు. చేవెళ్ల నుంచి గతంలో పోటీ చేసిన సీనియర్ నేత బి.జనార్దన్‌రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే మెదక్ నుంచి పోటీ చేస్తానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ పేరు కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి ఇక్కడి బీ ఫాం కోసం పట్టుబడుతున్నారు. వరంగల్ టికెట్‌ను మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, సీనియర్ నేతలు శ్రీధర్, చింతా సాంబమూర్తి కోరుతున్నారు. ఇక, సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్‌కే మరోసారి టికెట్ దాదాపు ఖరారైందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్‌పై మాత్రం సందిగ్ధం కొనసాగుతోందని చెప్పాయి. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్ టికెట్ల కోసం తక్కువ పోటీ ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జనసేనతో పొత్తుపై సందిగ్ధం..
ఎంపీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఇప్పటి వరకు స్పష్టత లేదని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు 8 స్థానాలు కేటాయించగా, ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. జనసేన ఎన్డీఏలో భాగస్వామి అని, ఆ పార్టీతో పొత్తు.. ఎంపీ ఎన్నికలకు పునాది అవుతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జనసేనతో పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నది త్వరలోనే తేలిపోతుందని పార్టీవర్గాలు తెలిపాయి.