Tamilisai Soundararajan: బీఆర్ఎస్ ఖమ్మం సభలో వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్

ABN , First Publish Date - 2023-01-19T18:33:11+05:30 IST

భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో గవర్నర్ వ్యవస్థపై సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కౌంటర్ ఇచ్చారు.

Tamilisai Soundararajan: బీఆర్ఎస్ ఖమ్మం సభలో వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్
Tamilisai Soundararajan

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ (BRS Khammam meeting)లో గవర్నర్ వ్యవస్థపై సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో గవర్నర్‌కు సంబంధించి సీఎం ప్రోటోకాల్ పాటించట్లేదని ఆమె చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడబోనన్నారు. మిగతా రాష్ట్రాల గురించి తాను మాట్లాడబోనని కానీ తెలంగాణ సర్కార్‌ ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదో చెప్పాలన్నారు. గవర్నర్‌ అంటే కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని తమిళిసై ప్రశ్నించారు. ఇది అహంకారం కాక మరేంటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదో సమాధానమివ్వాలన్నారు. అప్పుడు మాత్రమే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలన్నారు. తాను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. గవర్నర్ వ్యవస్థను ఎలా హేళన చేస్తారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గవర్నర్‌ను అవమానించారని ఆమె ఆరోపించారు.

నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎంలు ప్రసంగిస్తూ రాష్ట్రాల గవర్నర్లు అమాయకులని, ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నది ప్రధాని మోదీయేనని ఆరోపించారు. గవర్నర్లకు మంచి జీతం, విలాసవంతమైన భవనాలు, ఐదేళ్లు సుఖంగా ఉండేలా పోస్టు ఇస్తారని, ఆపై సీఎంలను ఇబ్బంది పెట్టాలని ఢిల్లీ నుంచి ఫోన్లు చేస్తుంటారని ఆరోపించారు. ఇలా ఇబ్బంది పెడుతూ పోతే దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్‌ సీఎం స్టాలిన్‌ను, తెలంగాణ గవర్నర్‌.. కేసీఆర్‌ను, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఢిల్లీ ప్రభుత్వాన్ని, పంజాబ్‌ గవర్నర్‌.. మాన్‌ను ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రధానికి పట్టవని, ఏ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఎమ్మెల్యేలను ఎలా కొనాలి లాంటి ఆలోచనలే చేస్తుంటారని విమర్శించారు. వరుసగా రెండు సార్లు అవకాశమిచ్చినా బీజేపీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, ప్రజల ఆరోగ్యం, విద్య గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా రాజకీయాల వల్లే అభివృద్ధిలో వెనకబడ్డామని అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం విజయన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ నేత డి.రాజా తదితరులు హాజరయ్యారు.

తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య సంబంధాలు ఇటీవల దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం, గవర్నర్‌ వ్యవస్థలు రెండూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం.. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించింది. దీంతో ఇందుకు ప్రతీకారం అన్నట్లుగా.. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా నిలువరించే అధికారం ఉన్నా... ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆమోదం తెలిపానని అప్పట్లో గవర్నర్‌ తీవ్రంగా స్పందించారు. అయితే గత శాసనసభ సమావేశాలకు కొనసాగింపుగానే సభను నిర్వహిస్తున్నామని, గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించుకోవచ్చంటూ ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. గవర్నర్‌ కూడా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం పంపించిన ప్రసంగ పాఠాన్ని కాకుండా తన సొంత ప్రసంగ పాఠాన్ని చదివారు. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. నిజానికి ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదిస్తే... గవర్నర్‌ తిరస్కరించినప్పటి నుంచే ఇరు వ్యవస్థల మధ్య దూరం మొదలైంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. గవర్నర్‌ వ్యవస్థను ఏమాత్రం కేర్‌ చేయనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది.

ఉగాది పండుగను పురస్కరించుకుని లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు యాదాద్రికి వచ్చిన గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ పునర్నిర్మాణం అనంతరం మొదటిసారిగా స్వామివారిని దర్శించుకునేందుకు గవర్నర్‌ రాగా.. అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు. అయితే గవర్నర్‌ తమిళిసై విషయంలో ఇలా ప్రొటోకాల్‌ ఉల్లంఘన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లినప్పుడు కూడా గవర్నర్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అక్కడి కలెక్టర్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నామమాత్రంగానైనా స్వాగతం పలకలేదు. ప్రొటోకాల్‌ను అమలు చేయలేదు. దీంతో గవర్నర్‌ విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య గవర్నర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రెండు చెంచుగూడేల సందర్శనకు వెళ్లగా.. అక్కడ కూడా కనీస ప్రొటోకాల్‌ నిబంధనలను పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. అక్కడి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గవర్నర్‌ పర్యటనలో పాల్గొనలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడం, అప్పటికే గవర్నర్‌కు, సీఎంకు మధ్య పొరపొచ్చాలు పెరగడం వంటి పరిస్థితుల దృష్ట్యా సహజంగానే ఆయన హాజరు కాలేదన్న చర్చ జరిగింది. గతేడాది రాజ్‌భవన్‌లో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవానికి సీఎం కేసీఆర్‌, ఆయన మంత్రివర్గ సహచరులెవరూ హాజరుకాలేదు.

గవర్నర్ తమిళిసై తల్లి 18 ఆగస్టు 2021న కన్నుమూశారు. మాతృమూర్తి కృష్ణ కుమారి (76) అనారోగ్యంతో మృతి చెందినప్పుడు తల్లి పార్ధివదేహం వద్ద తమిళిసై కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలు, ఇతర బంధువులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. గవర్నర్ తల్లి తాలూకు జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోదించారు. తమిళసై తల్లి చనిపోతే కూడా సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ (Raj Bhavan) పోలేదు. కనీసం ఫోన్ ద్వారా కూడా పరామర్శించలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి మరణిస్తే పరామర్శించాలన్న కనీస మర్యాద కూడా కేసీఆర్‌(KCR)కు లేదన్నారు. తాను ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. మూడు గంటలపాటు పార్థివ దేహం రాజ్‌భవన్‌లోనే ఉన్నా పరామర్శకు రాలేదని గవర్నర్‌ తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్ కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కేసీఆర్ ఎలాంటి పని ఒత్తిడిలో ఉన్నారో తెలియదు కానీ తమిళిపై తల్లికి శ్రద్దాంజలి ఘటించేందుకు రాలేదు. కృష్ణకుమారి మృతిపై కేసీఆర్ రాజ్‌భవన్ రాకుండా సంతాపం తెలిపి సరిపుచ్చుకున్నారు. విషాద సమయంలో కూడా కేసీఆర్ రాజకీయ వైరాన్నీ వీడలేదనే విమర్శలు వచ్చాయి. నిజానికి కనీస పలకరింపు లేనంతగా కేసీఆర్, గవర్నర్‌ మధ్య ఎడం ఏర్పడానికి కారణాలు కూడా పెద్దగా లేవు.

గవర్నర్ల వ్యవస్థపై బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభలో సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్‌ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు.

Updated Date - 2023-01-19T19:04:55+05:30 IST