T EAMCET : టీ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా
ABN , First Publish Date - 2023-05-26T04:02:04+05:30 IST
తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లోనూ టాప్-10లోపు అత్యధిక ర్యాంకులు దక్కించుకున్నారు. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్,

ఇంజనీరింగ్ టాప్-10లో 8 మంది వారే..
అగ్రికల్చర్, మెడికల్‌లోనూ ఏడు ర్యాంకులు
మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 80%, అగ్రికల్చర్-మెడికల్‌లో 86 శాతం ఉత్తీర్ణత
బాలురతో పోలిస్తే బాలికలదే పై చేయి..
రెండు కేటగిరీల్లోనూ 3 శాతం అధికంగా పాస్
ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత..
త్వరలోనే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లోనూ టాప్-10లోపు అత్యధిక ర్యాంకులు దక్కించుకున్నారు. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోలిస్తే.. బాలికలు ముందంజలో నిలిచారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్-మెడికల్ విభాగాల్లో కలిపి బాలుర కంటే మూడు శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 14 తేదీల మధ్య నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను గురువారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహరెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 2,05,351 మంది హాజరయ్యారు. ఇందులో మొత్తంగా 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో 1,18,739 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 94,065 మంది (79శాతం) ఉత్తీర్ణత సాధించారు. 76,536 మంది బాలికలు పరీక్ష రాయగా, 62,814 మంది (82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 87 శాతం ఉత్తీర్ణతను సాదించగా, బాలురు 84 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా, ఎంసెట్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన వారిలో ఏపీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇంజనీరింగ్‌లో టాప్-10 జాబితాలో 8మంది, అగ్రిక్చలర్, మెడికల్ విభాగంలో 7మంది విద్యార్థులు ఏపీ వారే కావడం విశేషం. ఇంజనీరింగ్ విభాగంలో 4వ, 7వ ర్యాంకులను మాత్రమే తెలంగాణ విద్యార్థులు సాధించారు. మిగిలిన 1, 2, 3, 5, 6, 8, 9, 10వ ర్యాంకులను ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 3, 6, 10 ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు, 1, 2, 4, 5, 7, 8, 9 ర్యాంకులను ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు.
రెండు రోజుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే జారీ చేయనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వీలైతే రెండు, మూడు రోజుల్లోనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్‌కు ఆమె సూచించారు. సకాలంలో ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఎంసెట్ ఫలితాలను త్వరగా విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు
ఎంసెట్- 2023 ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో ఎస్.కీర్తి 1,182, ఎ.రిషిత 3,311, నందిని 3,889 ర్యాంకు, పి.వైష్ణవి 3,930, ఇంజినీరింగ్ విభాగంలో కె.నందు 5808, జె.సునీల్ 6270, టి.కార్తీక్ 8620, కె.దీపక్ 9804వ ర్యాంకు సాధించారు. అలాగే, గౌలిదొడ్డిలోని ఎస్సీ గురుకుల విద్యార్థి సాడం రామకృష్ణ ఇంజనీరింగ్ విభాగంలో 237వ ర్యాంకు, జి.సంధ్య అగ్రికల్చర్, మెడికల్ కేటగిరీలో 207వ ర్యాంకు సాధించినట్లు అధికారులు తెలిపారు.
ముంబై ఐఐటీలో సీటు సాధిస్తా
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలన్నదే నా ధ్యేయం. తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మెరుగైన ర్యాంకు సాధించగలిగాను. తండ్రి ఖగేశ్వరరావు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్సైగా పనిచేస్తున్నారు. తల్లి ఝాన్సీ గృహిణి.
- సనపల అనిరుధ్, ఎంసెట్ ఇంజనీరింగ్ 1వ ర్యాంకర్
ఐఐటీ మద్రాసులో సీటు సాధిస్తా
ఐఐటీ మద్రాసులో సీటు సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా. జూన్ 4న జరగనున్న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నా. తల్లితండ్రులు శశిధర్, క్రాంతి ప్రోత్సాహం వల్లే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మంచి ర్యాంకు సాధించగలిగాను.
- అభినీత్ మాజేటి,
ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 4వ ర్యాంకర్
ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం
ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో సీటు సాధిస్తానన్న నమ్మకం ఉంది. భవిష్యత్తులో సివిల్స్‌లో ప్రతిభ చాటి ఐఏఎస్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. మా నాన్న మధుసూదన్‌రెడ్డి ప్రోత్సాహం, అధ్యాపకుల ప్రణాళిక వల్లే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించ గలిగాను.
- శాన్వితరెడ్డి,
ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 7వ ర్యాంకర్
కార్డియాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం
తెలంగాణ ఎంసెట్ మెడికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా వుంది. వైద్య విద్యను అభ్యసించి కార్డియాలజిస్ట్ కావాలనేది నా లక్ష్యం. రోజూ ఉదయం 6నుంచి రాత్రి 9గంటల వరకు చదువుకోవడం, బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగా.
- బురుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్, అగ్రికల్చర్, మెడికల్‌లో 1వ ర్యాంకర్
మంచి కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తా
నేను మంచి కాలేజీలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫలితాల సాధనకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, పట్టుదల కారణం. నీట్ పరీక్షలు రాశాను. అందులో మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. నీట్ పరీక్షల ఫలితాలు వచ్చాక అందులో వచ్చే ర్యాంకును బట్టి ఏ కాలేజీలో సీటు వస్తుందో చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటా. కృషి, పట్టుదల, ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
- నాశిక వెంకట్ తేజ, ఎంసెట్ అగ్రి, మెడికల్‌లో 2వ ర్యాంకర్
డాక్టర్ కావాలన్న కసితో..
నాకు చిన్నతనం నుంచే డాక్టర్ కావాలన్న కోరిక ఉండేది. డాక్టర్ కావాలన్న కసితో ప్రణాళిక ప్రకారం చదివా. తాను ఈ ర్యాంకు సాధించడం వెనుక కళాశాల అధ్యాపకులు, సిబ్బందితోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.
- పసుపులేటి సఫల్ లక్ష్మి,
అగ్రికల్చర్-మెడికల్‌లో 3వ ర్యాంకర్
రోజూ 14 గంటలు కష్టపడ్డా
ఇంటర్‌లో 988 మార్కులు సాధించాను. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు కోసం కళాశాల హాస్టల్‌లో ఉంటూ రోజూ 14గంటల పాటు కష్టపడి చదివా. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత న్యూరాలజిస్ట్ కావాలన్నదే నా లక్ష్యం. వైద్య రంగంలో నా వంతుగా పేదలకు సహాయం చేసేందుకు కృషి చేస్తా.
- దేవగుడి గురు శశిధర్‌రెడ్డి,
అగ్రికల్చర్-మెడికల్‌లో 6వ ర్యాంకర్
ఒత్తిడిని అధిగమిస్తే విజయమే
తల్లిదండ్రుల గైడెన్స్, స్నేహితుల సహకారంతోనే ఈ విజయం సాధించగలిగా. పది మంది స్నేహితులతో కలిసి ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యా. నాతో పాటు వారూ మంచి ర్యాంకులు సాధించారు. ఒత్తిడిని అధిగమిస్తే విజయం సులువవుతుంది.
- కొల్లాబత్తుల ప్రీతమ్ సిద్ధార్థ్, అగ్రికల్చర్-మెడికల్‌లో 10వ ర్యాంకర్
ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో టాపర్లు...
పేరు మార్కులు ర్యాంకు జిల్లా
సనపల అనిరుధ్ 158.89 1 విశాఖపట్నం
ఎక్కంటిపాని మణీంద్రరెడ్డి 158.59 2 గుంటూరు
చల్ల ఉమేష్ వరుణ్ 156.94 3 కృష్ణా
అభినీత్ మాజేటి 156.58 4 హైదరాబాద్
పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి 156.01 5 అనంతపురం
మారదాన ధీరజ్‌కుమార్ 156.01 6 విశాఖపట్నం
వడ్డే శాన్వితారెడ్డి 155.95 7 నల్లగొండ
బోయిన సంజన 155.54 8 శ్రీకాకుళం
నంద్యాల ప్రిన్స్ బ్రన్హంరెడ్డి 155.33 9 కర్నూలు
మీసాల ప్రణతి శ్రీజ 155.02 10 విజయనగరం
అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో టాపర్లు
బురుగుపల్లి జస్వంత్ 155.00 1 తూర్పు గోదావరి
నాశిక వెంకట్ తేజ 154.60 2 ప్రకాశం
సఫల్ లక్ష్మీ పసుపులేటి 154.52 3 రంగారెడ్డి
దుర్గెంపూడి కార్తికేయరెడ్డి 153.57 4 గుంటూరు
బోర వరుణ్ చక్రవర్తి 152.63 5 శ్రీకాకుళం
దేవగుడి గురు శశిధర్‌రెడ్డి 152.44 6 హైదరాబాద్
వంగీపురం హర్షిల్‌సాయి 151.33 7 నెల్లూరు
ధనాల సాయి చిద్విలా్‌సరెడ్డి 150.96 8 గుంటూరు
గంధమనేని గిరివర్హిత 150.95 9 అనంతపురం
కొల్లాబత్తుల ప్రీతమ్ సిద్ధార్థ 150.95 10 హైదరాబాద్