దయనీయ స్థితిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ మృతి

ABN , First Publish Date - 2023-06-01T03:30:18+05:30 IST

ఈ-కామర్స్‌ సంస్థల తరఫున హోం డెలివరీలు చేసే గిగ్‌ వర్కర్ల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ హైదరాబాద్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది.

దయనీయ స్థితిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ మృతి

హాస్టల్‌ గదిలో మరణం.. రెండ్రోజులకు గుర్తింపు

బేగంపేట, మే 31 (ఆంధ్రజ్యోతి): ఈ-కామర్స్‌ సంస్థల తరఫున హోం డెలివరీలు చేసే గిగ్‌ వర్కర్ల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ హైదరాబాద్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది. తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి దయనీయ స్థితిలో కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఆ వ్యక్తి తానుంటున్న హాస్టల్‌ గదిలోనే చనిపోయాడు. తమిళనాడుకు చెందిన గోపాలన శ్రీనివాస్‌ (50) బేగంపేటలోని ఓ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 28న(ఆదివారం) విధులు ముగించుకుని హాస్టల్‌కు చేరుకున్న గోపాలన్‌ భోజనం చేసి తన గదిలోకి వెళ్లి మళ్లీ బయటకు రాలేదు. అయితే, హాస్టల్‌ నుంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వారు మంగళవారం మధ్యాహ్నం హాస్టల్‌ యజమానికి ఫిర్యాదు చేశారు. నిర్వాహకులు అన్ని గదులు తనిఖీ చేశారు. అయితే, గోపాలన్‌ గది నుంచి దుర్వాసన అధికంగా వస్తుండటంతో లోపలికి వెళ్లి చూడగా అతను అచేతనంగా పడి ఉన్నాడు. దీనిపై హాస్టల్‌ యజమాని ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్నారు. గోపాలన్‌ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గోపాలన్‌ కొంతకాలంగా హైబీపీతో బాధపడుతున్నాడని, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో చికిత్స తీసుకుంటున్నాడని అతని గదిలో దొరికిన మెడికల్‌ రిపోర్ట్స్‌ ఆధారంగా గుర్తించారు.

Updated Date - 2023-06-01T03:30:18+05:30 IST