Share News

Greensignal for four sittings : గెలుపు గుర్రాల కోసం సర్వే

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:54 AM

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది.

Greensignal for four sittings : గెలుపు గుర్రాల కోసం సర్వే

రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం

దక్షిణ భారత దేశంపై కమలం ప్రత్యేక దృష్టి

ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం

నలుగురు సిటింగ్‌లకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌?

హైదరాబాద్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ, అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వేను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిటింగ్‌ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతోందని సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా, 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 32 లక్షల ఓట్లను సాధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ స్థానాల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రస్తుతం 31 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 26 మంది, పుదుచ్చేరి నుంచి ఒకరు, తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు, దక్షిణాదిన ఇప్పుడున్న సీట్లను గణనీయంగా పెంచుకునే దిశగా అంతర్గత కసరత్తును ముమ్మరం చేసింది’’ అని పార్టీ జాతీయ ముఖ్య నేత వివరించారు. కాగా, తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రెండు రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌లలో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఇక, దక్షిణాదిన పట్టు మరింత పెంచుకోవడం కీలకమని అధినాయకత్వం భావిస్తోంది. ‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర సీట్లు గెలుచుకోలేకపోయినా.. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించింది. ఓటు బ్యాంకును రెట్టింపు(7శాతం నుంచి 14శాతానికి) చేసుకుంది. అలాగే, గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు బీజేపీ 20 శాతం ఓటుబ్యాంకు సాధించింది. ప్రధాని మోదీ కరిష్మాతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఇప్పటికే అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకు అనుగుణంగానే అమిత్‌ షా ప్రకటన చేశారు’’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకోబోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలు తమకు మాట ఇచ్చారన్నారు.

నలుగురు సిట్టింగ్‌లకు మళ్లీ చాన్స్‌..?

ఎంపీలుగా కొనసాగుతున్న నలుగురికి పార్టీ జాతీయ నాయకత్వం మరోసారి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి- సికింద్రాబాద్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌- కరీంనగర్‌, సోయం బాపురావు- ఆదిలాబాద్‌, ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో కిషన్‌రెడ్డి తప్ప మిగతా ముగ్గురు ఎంపీలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ఆదిలాబాద్‌ టికెట్‌ను మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కోరుతున్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావును కొనసాగిస్తారా..? లేక రమేశ్‌ రాథోడ్‌కు అవకాశం ఇస్తారా..? అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మరికొందరు సీనియర్‌ నేతలు కూడా ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

కేంద్ర పథకాలపై ప్రచారానికి శ్రీకారం

ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారానికి బీజేపీ శనివారం శ్రీకారం చుట్టింది. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర పేరిట 40 రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం ఆవాస్‌ యోజన, ముద్ర రుణాలు, పీఎం ఉపాధి కల్పన, పీఎం స్వానిధి యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్‌ధన్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, అటల్‌ పెన్షన్‌ యోజన వంటి పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రచారం చేయనున్నారు.

ఎన్నికలకు సిద్ధం కావాలి: సునీల్‌ బన్సల్‌

నిర్మల్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్‌లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బీజేపీ సమీక్షకు ఆయన హాజరయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Updated Date - Dec 18 , 2023 | 02:54 AM