విజయమే లక్ష్యం కావాలి

ABN , First Publish Date - 2023-09-18T04:24:50+05:30 IST

కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ విజయమే లక్ష్యంగా ఐక్యంగా పని చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు.

విజయమే లక్ష్యం కావాలి

క్రమశిక్షణ, ఐక్యతతోనే శత్రువును ఓడించగలం

నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం: ఖర్గే

సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ విజయమే లక్ష్యంగా ఐక్యంగా పని చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. మీడియా ద్వారా పార్టీకి, పార్టీ నేతలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. స్వీయ నిగ్రహం పాటిస్తేనే పార్టీ ప్రయోజనాలు కాపాడిన వారవుతారన్నారు. అలాగే పార్టీలో సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమని, నేతల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ద్వారానే శత్రువులను ఓడించగలమని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఇది స్పష్టమైందని తెలిపారు. ఆదివారం తాజ్‌ కృష్ణా హోటల్లో జరిగిన సీడబ్ల్యూసీ విస్తృత సమావేశంలో పార్టీ నేతలకు ఆయన ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలే దీనికి నిదర్శనమని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయని, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకూ సంసిద్దంగా ఉండాలన్నారు. ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాలు సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు కొత్త నమూనాకు నాంది పలికాయని, వీటిని దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు.

విశ్రాంతి తీసుకునే సమయం కాదు..

త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మండల, బ్లాక్‌, జిల్లా స్థాయిల్లో కమిటీల ఏర్పాటు పూర్తయిందా? వాటిని ఎన్నికలకు సన్నద్ధం చేశారా? ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారా? అని ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలను ఖర్గే ప్రశ్నించారు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదని, కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకువచ్చేదాకా అవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీకి మహాత్మాగాంధీ అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి వందేళ్లు పూర్తి కావస్తుందని, ఆయనకు నివాళిగా 2024లో బీజేపీని అధికారం నుంచి దించేద్దామన్నారు. తెలంగాణ నుంచి నూతనోత్తేజంతో, స్పష్టమైన సందేశంతో వెళదామని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిద్దామని ఖర్గే పిలుపునిచ్చారు.

రాహుల్‌ రిజర్వ్‌ బ్యాంకు లాంటివాడు: ఖర్గే

రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి రిజర్వ్‌ బ్యాంకు లాంటివారని, దానిని వెంట వెంటనే ఖాళీ చేయడం సరికాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ విస్తృత సమావేశంలో.. రాహుల్‌ రెండో విడత భారత్‌ జోడో యాత్ర వెంటనే చేపట్టాలంటూ వచ్చిన ప్రతిపాదన పట్ల ఖర్గే ఇలా స్పందించినట్లు సమాచారం.

Updated Date - 2023-09-18T04:24:50+05:30 IST