గచ్చిబౌలి పీఎస్ సీసీటీవీ ఫుటేజ్ సమర్పించండి
ABN , First Publish Date - 2023-08-18T04:45:35+05:30 IST
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన కస్టోడియల్ మరణంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టోడియల్ డెత్ జరిగిన జూలై 7 నాటి సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
కస్టోడియల్ మరణంపై పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన కస్టోడియల్ మరణంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టోడియల్ డెత్ జరిగిన జూలై 7 నాటి సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీ్‌సస్టేషన్‌లలో కెమెరాల ఏర్పాటు అంశం ఎక్కడి వరకు వచ్చిందో వివరిస్తూ స్థాయీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నానక్‌రాంగూడలోని ఓ నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన నితీశ్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డును గచ్చిబౌలి పోలీసులు విచారణ పేరుతో పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి మూడురోజులు ఉంచడంతో చనిపోయాడు. ఈ ఘటనపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను జోడిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టుకు లేఖరాశారు. దీనిని సుమోటో వ్యాజ్యంగా స్వీకరించింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బాధితుడు గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు. మెడికల్ రిపోర్టు సైతం గుండెపోటు అంశాన్ని నిర్ధారిస్తున్నదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని.. ఆ వీడియోలను పరిశీలించాకే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.