పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యండి

ABN , First Publish Date - 2023-09-18T04:51:07+05:30 IST

తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యాలని పార్టీ ముఖ్య నేతలకు కేంద్ర మంత్రి అమిత్‌ షా సూచించారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యండి

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఈటలకు అమిత్‌షా సూచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యాలని పార్టీ ముఖ్య నేతలకు కేంద్ర మంత్రి అమిత్‌ షా సూచించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, చేరికల కమిటీ అధ్యక్షులు ఈటల రాజేందర్‌తో షా ఆదివారం సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ బూత్‌ కమిటీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలను కోరారు. వచ్చేనెల 2వ తేదీ వరకు పోలింగ్‌ బూత్‌ స్వశక్తీకరణ్‌ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిలు తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌ కూడా పాల్గొన్నారు. కాగా, ప్రతిపాదిత బస్సుయాత్రలు ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నిజాం వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ బాటలోనే నడుస్తోన్న బీఆర్‌ఎస్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు.

అరచేతిలో వైకుంఠంలా హామీలు: ఎన్వీ సుభాష్‌

విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ విమర్శించారు. దివాలా తీసిన రాష్ట్రంలో ఆయా హామీలను ఎలా అమలు చేస్తుందో కాంగ్రెస్‌ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, తర్వాత ముఖం చాటేయడం కాంగ్రె్‌సకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రూ.4 వేల పింఛను ఇస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ విధానాన్ని ఎందుకు అమలు చెయ్యడం లేదో చెప్పాలని నిలదీశారు.

Updated Date - 2023-09-18T04:51:07+05:30 IST