ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై స్టే

ABN , First Publish Date - 2023-05-26T03:04:21+05:30 IST

ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఏర్పాటు చేయనున్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహ ప్రతిష్ఠాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది.

ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై స్టే

సర్కారు అనుమతి ఉత్తర్వులు సస్పెన్షన్‌

హైదరాబాద్‌/ఖమ్మం, మే 25 (ఆంధ్రజ్యోతి): విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ నీటి పారుదల శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ యాదవ సంఘాలు, శ్రీకృష్ణుని భక్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. విగ్రహం ఏర్పాటు చేస్తున్నది తామే అని ఈ పిటిషన్లలో అమెరికాకు చెందిన ‘తానా’ ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసింది. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చలకాని వెంకట్‌యాదవ్‌, సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. చెరువు మధ్యలో విగ్రహ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ఇచ్చిన అనుమతి చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసం ఉద్దేశించిన ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టుకు సమర్పించారు. వాల్టా చట్టం, కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు విగ్రహ ఏర్పాటుకు అనుమతించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ నిజ రూపంలో విగ్రహం పెడితే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ‘తానా’ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్‌ వాదించారు. అది శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం కాదని.. విగ్రహానికి నెమలి పింఛం, పిల్లనగ్రోవి లేవని పేర్కొన్నారు. దండ ఉన్నంత మాత్రాన శ్రీకృష్ణుడి రూపమని చెప్పడానికి వీల్లేదని అన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం పెడితే అభ్యంతరం లేదని పిటిషనర్లు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. లకారం చెరువు పబ్లిక్‌ యుటిలిటీ ప్రాంతం కిందకు రాదని తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంలో రాజకీయ దురుద్దేశం ఉందని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ఆర్‌అండ్‌బీ రోడ్లకు వర్తిస్తుందని.. చెరువు పబ్లిక్‌ యుటిలిటీ ప్రాంతం కాదని తెలిపారు. ఆ చెరువు కింద ఆయకట్టు లేదని.. కేవలం సందర్శకుల కోసం అభివృద్ధి చేసిందని.. అందులో విగ్రహం పెట్టడంలో తప్పు లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. విగ్రహ ఏర్పాటుకు నీటి పారుదలశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

28న విగ్రహ ఆవిష్కరణ లేనట్టే..

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఈ నెల 28న ఖమ్మంలోని లకారం చెరువులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడినట్లేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో స్పష్టమవుతోంది. నీటిపారుదల శాఖ అనుమతులు ఇచ్చిన విషయంపై వివరణ తీసుకునేందుకు కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. కాగా, పలు అభ్యంతరాల నేపథ్యంలో ఇప్పటికే నిర్వాహకులు విగ్రహంలో కిరీటంపైన నెమలి పింఛం, వెనక ఉన్న విష్ణు చక్రం, చేతిలోని పిల్లనగ్రోవిని తొలగించారు. విగ్రహానికి నీలి రంగు కాకుండా బంగారు రంగు వేశారు.

Updated Date - 2023-05-26T03:04:21+05:30 IST