పొంగులేటి ప్రసాద్‌రెడ్డి భూవివాదంపై యథాతథస్థితి
ABN , First Publish Date - 2023-07-19T02:57:02+05:30 IST
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి చెందిన భూవివాదంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
హైకోర్టు ఉత్తర్వులు
సర్వే నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి చెందిన భూవివాదంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామపరిధిలో నాగార్జున సాగర్ కాల్వ సమీపంలో తమకు చెందిన దాదాపు 30 గుంటల భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ ప్రసాద్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వే చేస్తామంటూ ఈనెల 14న నోటీసులు కూడా ఇచ్చారని తెలిపారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఆ భూమి నాగార్జున సాగర్‌కు సంబంధించిందని, ప్రభుత్వం ఎప్పుడో సేకరించిందని తెలిపారు. దానిని పిటిషనర్ ఆక్రమించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అధికారులు నిర్వహిస్తున్న సర్వే నివేదికను సైతం సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది.