నెలసరి సెలవులపై స్మృతీ ఇరానీ తీరు విచారకరం: కవిత
ABN , Publish Date - Dec 16 , 2023 | 02:31 AM
ఉద్యోగినులకు నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తిరస్కరించడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 15: ఉద్యోగినులకు నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తిరస్కరించడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. నెలసరి అనేది సహజ ప్రక్రియ అని.. ఆ సమయంలో సెలవులు ఇస్తే.. అది పనిచేసే చోట వివక్షకు దారితీస్తుందని స్మృతీ సోమవారం పార్లమెంటులో ఆర్జేడీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ప్రకటన నిరుత్సాహం కలిగించిందని.. ఒక మహిళగా ఆమె అలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండాల్సిందంటూ ట్వీట్ చేశారు. మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందిని గమనించి సెలవులు మంజూరు చేయాల్సి పోయి.. ఆ ప్రతిపాదనను తిరస్కరించడం సరికాదని పేర్కొన్నారు. నెలసరి అనేది సహజమైన జీవ ప్రక్రియ అని.. చాయిస్ కాదని పేర్కొన్నారు. అలాంటి సమస్యకు వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అంటే.. కోట్లాదిమంది మహిళా ఉద్యోగినుల బాధను విస్మరించినట్లేనని కవిత విమర్శించారు.