ఎస్సై వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2023-03-05T03:32:02+05:30 IST
తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగివ్వకపోగా.. తన భార్యను తనకు దూరం చేశాడని ఓ ఎస్సైపై ఆరోపణలు చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాడు.
అప్పు చెల్లించకపోగా భార్యను దూరం చేశాడంటూ వీడియో
ఖిల్లా (నిజామాబాద్), మార్చి 4: తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగివ్వకపోగా.. తన భార్యను తనకు దూరం చేశాడని ఓ ఎస్సైపై ఆరోపణలు చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాడు. నిజామాబాద్‌లో శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సెల్ఫీ వీడియోలో బాధితుడు చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన క్రాంతి అనే వ్యక్తి మేకల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై బాబూరావుతో అతనికి పరిచయముంది.
ఈ క్రమంలో బాబూరావు తన అవసరాల నిమిత్తం రెండేళ్ల క్రితం క్రాంతి వద్ద రూ. 7లక్షల నగదు, 3.5 తులాల బంగారం అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. అయితే, అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వాలని క్రాంతి కొద్ది రోజులుగా బాబూరావును అడుగుతున్నాడు. బాబూరావు డబ్బు తిరిగి ఇవ్వకపోగా క్రాంతిపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. పైగా, క్రాంతి దంపతుల మధ్య విభేదాలు సృష్టించాడు. ఇటీవల క్రాంతి భార్యను కూడా తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎస్సై బాబూరావు వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని క్రాంతి ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోను చూసిన క్రాంతి స్నేహితులు అతన్ని వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్రాంతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.