సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మృతి
ABN , First Publish Date - 2023-08-18T04:17:05+05:30 IST
సీనియర్ జర్నలిస్టు చిర్రావూరి వెంకట మురళీ కృష్ణారావు(64) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్, గోపన్నపల్లి జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గురువారం తుది శ్వాస విడిచారు.
సీఎం కేసీఆర్, మాజీ సీజేఐ ఎన్వీ రమణ సహా పలువురి సంతాపం.. నేడు అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీ, న్యూఢిల్లీ, రాయదుర్గం, ఆగస్టు17 (ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు చిర్రావూరి వెంకట మురళీ కృష్ణారావు(64) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్, గోపన్నపల్లి జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గురువారం తుది శ్వాస విడిచారు. ఏపీలోని ఏలూరుకు చెందిన సీహెచ్‌ఎంవీ కృష్ణారావు అక్కడి సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పాత్రికేయ రంగంలో అడుగుపెట్టారు. 47 ఏళ్ల కెరీర్‌లో ఈనాడు, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్‌గా 2019లో పదవీ విరమణ పొందారు. భారీ నీటిపారుదల, చట్టసభల రిపోర్టింగ్‌లో సాధికారత కలిగిన కృష్ణారావును సమకాలీన పాత్రికేయులు చాలా మంది పెద్దబాబాయి అని పిలుచుకుంటారు.
ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు. కృష్ణారావు మరణం పట్ల సీఎం కేసీఆర్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోసం చేసిన రచనలు విశ్లేషణలు, టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కృష్ణారావు ఇక లేరన్న వార్త తనకు దిగ్ర్భాంతి కలిగించిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక ఎన్‌సైక్లోపీడియా అయిన కృష్ణారావు పాత్రికేయులందరికీ ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, దేవులపల్లి అమర్ సహా పలువురు జర్నలిస్టులు కృష్ణారావుకు నివాళులర్పించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, నామా నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు.