Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

ABN , First Publish Date - 2023-02-26T17:37:03+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల (KMC) విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Dr. Preethi) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన నాటికి ఇవాళ్టికి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు...

Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల (KMC) విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Dr. Preethi) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన నాటికి ఇవాళ్టికి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ఐదు రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రీతి చికిత్స పొందుతోంది. దీంతో ప్రీతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు.. రాజకీయ నాయకులు పరామర్శకు వచ్చి ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేస్తుండటంతో ప్రీతి తోటి విద్యార్థులు కంగారుపడుతున్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి ప్రీతి గురించి చేదువార్త చెప్పే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలేం జరుగుతోంది..?

మూడు రోజులుగా ఎక్మోపై ప్రత్యేక వైద్య బృందం ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ ప్రీతి శరీరం సహకరించట్లేదని నిమ్స్ (NIMS) ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ప్రీతికి EEG టెస్ట్ చేయాలని వైద్యులు యోచిస్తున్నారు. టెస్ట్ చేసిన మూడు గంటల తర్వాత (ఆదివారం సాయంత్రానికి) రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. EEG అంటే ఎలక్ట్రో ఎన్సెఫాలో గ్రఫీ.. ఈ పరీక్ష ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ తెలుస్తుంది. EEG రిపోర్టును బట్టి ప్రీతికి ఎక్మోపై వైద్యం కొనసాగించాలా? లేకుంటే డెత్ డిక్లేర్ చేయాలా అనేది నిమ్స్ వైద్యుల బృందం డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో నిమ్స్ దగ్గర పోలీసుల భద్రత పెంచారు. ఒకవేళ డెత్ డిక్లేర్ చేస్తే.. గాంధీ హాస్పిటల్‌లో పోస్టుమార్టం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా.. మరికాసేపట్లో ప్రీతి మృతి చెందినట్లు ప్రకటించే అవకాశముందని సోషల్ మీడియాలో (Social Media) కొందరు నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. మరోవైపు.. గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) వద్ద భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆసుపత్రిలో ఎందుకింత హడావుడి చేస్తున్నారని అడిగి తెలుసుకునేందుకు కూడా మీడియాను పోలీసులు లోపలికి అనుతివ్వడం లేదు. ఆస్పత్రి దగ్గర బారీకేడ్లతో పోలీసులు అలెర్ట్‌గా ఉన్నారు. మార్చురీ వద్ద కూడా పెద్దఎత్తున పోలీసులు ఉన్నారు. అటు నిమ్స్‌లో ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండటం.. ఇటు గాంధీ ఆస్పత్రిలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండటంతో ఈ పరిస్థితులను చూస్తున్న విద్యార్థిని ఫ్రెండ్స్‌కు అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదని కంగారుపడుతున్నారు.

Preethi.jpg

ఆస్పత్రి వర్గాలు ఏమంటున్నాయ్..?

ప్రీతి గారు ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుందాం. నిమ్స్ వైద్యులు ప్రీతిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తున్నది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం బాధాకరం. నిమ్స్ బులిటెన్ రూపంలో విడుదల చేస్తున్న సమాచారం మాత్రమే సరైంది. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోగలరుఅని నిమ్స్ ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

Preethi-1.jpg

మంత్రి ప్రకటనతో..!

ఇవన్నీ అటుంచితే.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Minister Errabelli Dayakar Rao) కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీతి బతికేందుకు ఒక్కశాతమే అవకాశం ఉందని ఎర్రబెల్లి ప్రకటన చేశారు. దీంతో ఆయనపై మెడికల్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈయన ఇలాంటి ప్రకటనలు చేయడమేంటని.. కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నా బిడ్డ పేరు కూడా ప్రీతే. నిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్న ప్రీతీని చూస్తే దుఃఖం వస్తోంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రీతీ కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబం నా నియోజకవర్గానికి చెందిన వారే. ఆ కుటుంబానికి నేను పూర్తిగా అండగా ఉంటాను. ప్రీతిని వేధించిన వారెవరినీ వదిలే ప్రసక్తి లేదు. మంత్రి సత్యవతి రాథోడ్, నేను కలిసి ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.

ప్రీతి తండ్రి ఇలా..!

మరోవైపు.. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారని విద్యార్థిని తండ్రి (Preethi Father) కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రీతి బతికే అవకాశం ఒక్కశాతం కూడా లేదని వైద్యులు చెబుతున్నారని మీడియాకు చెబుతూనే బోరున ఏడ్చేశారాయన. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ఆయన వేడుకున్నారు.Preethi-2.jpg

Updated Date - 2023-02-26T20:11:57+05:30 IST