Share News

బర్రెలక్కకు భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2023-11-25T04:49:41+05:30 IST

ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్‌ శిరీషకు గన్‌మెన్‌ను కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది.

బర్రెలక్కకు భద్రత కల్పించాలి

ఎన్నికలు ముగిసేవరకు గన్‌మెన్‌ను కేటాయించాలి

పాదయాత్రలు, ప్రచారానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్‌ శిరీషకు గన్‌మెన్‌ను కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ఆమె పాదయాత్రలు, ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా పోలీసు బందోబస్తు కల్పించాలని పేర్కొంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకోనివ్వడం లేదని, తన తమ్ముడిపై కత్తితో దాడి జరిగిందని, తమవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, భద్రత కల్పించాలని కోరుతూ శిరీష హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌కు విన్నవించినా చర్యలు తీసుకోలేదని, పోలీసులూ భద్రత కల్పించలేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదించారు. కాగా, వ్యక్తిగత గొడవల్లో భాగంగా పిటిషనర్‌ తమ్ముడిపై దాడి జరిగిందని.. కేసు దర్యాప్తు జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్‌ తెలిపారు. వ్యక్తిగత భద్రత కల్పిస్తారా? కేంద్ర దళాలతో భద్రత కల్పించడంతో పాటు, నియోజకవర్గంలో అబ్జర్వర్‌ను నియమించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మధ్యాహ్నం తర్వాత విచారణ సందర్భంగా భద్రత కల్పించడానికి పోలీసులు అంగీకారం తెలిపారు. దీంతో పిటిషనర్‌కు వ్యక్తిగత గన్‌మెన్‌తో పాటు ప్రచారానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించిన హైకోర్టు పిటిషన్‌ను ముగించింది.

ప్రజాప్రతినిధుల పెండింగ్‌ కేసుల వివరాలు సమర్పించండి

తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల వివరాలను సేకరించి.. క్రోడీకరించి సమర్పించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో సైతం తెలియజేయాలని పేర్కొంది. ‘అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ’ కేసులో ప్రజా ప్రతినిధుల పెండింగ్‌ కేసుల విచారణ వేగిరం చేయాలని, హైకోర్టులు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. ఈ కేసులకు ప్రాధాన్యం ఇచ్చి విచారించాలని.. రాష్ట్రంలోని స్పెషల్‌ కోర్టులకు మా ర్గదర్శకాలు ఇవ్వాలని తెలిపింది. మరణ శిక్ష, జీవిత ఖైదు, ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని.. స్టే ఆదేశాలున్న కేసుల్లో ట్రయల్‌ను వేగంగా ముగించాలని పేర్కొంది. కాగా, దీనిపై పర్యవేక్షణ చేపట్టడానికి చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం సుమోటోగా స్వీకరించి శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, సీబీఐ, రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రతివాదులుగా ఉన్న కేసు తదుపరి విచారణను డిసెంబరు 15కు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-25T04:49:43+05:30 IST