రహస్య మంతనాలు!
ABN , First Publish Date - 2023-05-26T03:52:50+05:30 IST
కమలం పార్టీ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ ముఖ్యులు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ చేరికల కమిటీ

పొంగులేటి, జూపల్లితో ఈటల భేటీ
హైదరాబాద్, ఖమ్మం, మే 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కమలం పార్టీ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ ముఖ్యులు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ చేరికల కమిటీ అఽధ్యక్షుడు ఈటల రాజేందర్, మరో ఇద్దరు సీనియర్ నేతలు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో గురువారం రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివారులో ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ భేటీ జరిగింది. ఈటలతో పాటు సదరు ఇద్దరు ముఖ్యనేతలు తమ మొబైల్ ఫోన్‌లు, సొంత వాహనాలు, వ్యక్తిగత భద్రత సిబ్బందిని వదలిపెట్టి వేర్వేరు వాహనాల్లో ఫాంహౌజ్‌కు చేరుకున్నారు. ఈటల, షామీర్‌పేటలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 9 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ చేరుకున్నారు. గన్‌మెన్‌లు, వాహనాన్ని వదలిపెట్టి మరో వాహనంలో ఫాంహౌజ్‌కు వెళ్లారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. ఇక, పొంగులేటి బుధవారం రాత్రే ఖమ్మం నుంచి హైదరాబాద్ చేరుకోగా, జూపల్లి కొల్లాపూర్ నుంచి రెండ్రోజుల కిందటే వచ్చారు. వీరితో, బీజేపీ ముఖ్యనేతలు దాదాపు రోజంతా సమావేశమై వివిధ సమీకరణాలు, చేరికలపై చర్చించారని సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు చెందిన పలువురు సీనియర్ నేతలతో కూడా మంతనాలు జరిగినట్లు సమాచారం. మరోపక్క, చర్చల సారాంశాన్ని పార్టీ ముఖ్యనేతలకు ఎప్పటికప్పుడు తెలియజేశారని చెబుతున్నారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం బీజేపీ నేతలు కొత్త ఫోన్‌లు, సిమ్‌లు ఉపయోగించారట. కాగా, బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలో బుధవారం కలిశారు. ఏపీలో పలు కాంట్రాక్టులతోపాటు మైనింగ్ టెండర్లు దక్కించుకున్న పొంగులేటి ఆయా పనుల నిమిత్తమే జగన్‌ను కలిశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే, జగన్‌ను కలిసొచ్చిన తర్వాతి రోజే ఈటలతో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. పొంగులేటి కాషాయ దళంలో చేరుతున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.