Congress Guarantee Card : 6 గ్యారెంటీలపై దూకుడే!
ABN , First Publish Date - 2023-09-22T02:57:51+05:30 IST
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వేగం పెంచింది.
రైతులు, మహిళల శ్రేయస్సే లక్ష్యంగా పథకాలు..
ప్రజల వద్దకు చేరుస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
ఇంటింటికీ కార్యక్రమంతో కార్డుల పంపిణీ
విశేష స్పందన వస్తోందంటున్న కాంగ్రెస్
ఎన్నికల నాటికి మరింత పెరుగుతుందన్న ధీమా
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వేగం పెంచింది. విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అద్భుతమైన స్పందనను తెచ్చిపెడుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా రైతులు, మహిళల శ్రేయస్సు కోసం ప్రకటించిన ప్రత్యేక పథకాలు ఆ వర్గాలను అమితంగా ఆకట్టుకుంటున్నాయంటున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, దించేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నా.. రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉండే రైతులు, మహిళల పాత్రే ప్రధానంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో ఈ వర్గాలనే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది.
ప్రజల్లోకి విస్తృతంగా..
‘అభయహస్తం’ పేరుతో ప్రకటించిన గ్యారెంటీ కార్డులో రైతులు, మహిళల ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. దీన్ని ఆ వర్గాల దరికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్యారెంటీ కార్డులోని హామీలనూ వివరిస్తూ.. తాము అధికారంలోకి వస్తే తప్పక అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రైతులు, మహిళల్లోనూ తమ గ్యారెంటీలపై సానుకూల ఆలోచన మొదలైందని పేర్కొంటున్నారు. మహిళల విషయానికి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా పురుష ఓటర్ల సంఖ్య 1.57 కోట్లు కాగా.. మహిళా ఓటర్లు 1.56 కోట్ల మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ కార్డులో రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా లబ్ధిదారు అయ్యేలా మహాలక్ష్మి పేరుతో హామీలను చేర్చింది. వీటిలో ప్రధానమైనది గృహిణులకు ప్రతినెలా రూ.2500 అందజేసే హామీ. మహిళల వ్యక్తిగత అవసరాలు, వంటింట్లో అవసరమయ్యే దినుసులు వంటి చిన్న చిన్న వస్తువులు కొనేందుకు కూడా భర్తపై ఆధారపడకుండా ఈ సాయం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చాలా కుటుంబాల్లో మహిళలకు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకుందామన్న ఆలోచన ఉన్నా.. ఆ మేరకు ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇచ్చేరూ.
2500 సాయం.. మహిళల పొదుపునకు కూడా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడం మహిళలకు ఎంత ఉపయోగకరమో చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నాయి. కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ హామీ పట్ల మహిళల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని గుర్తు చేస్తున్నాయి. మహిళల కోసం కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో పేర్కొన్న మరో హామీ.. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్. ప్రస్తుతం భారీగా ఉన్న గ్యాస్ సిలిండర్ భారాన్ని ఒకేసారి తగ్గించడం ద్వారా మహిళలకు గొప్ప ఊరట కల్పించినట్లవుతుందని చెబుతున్నారు. మొత్తంగా మహాలక్ష్మి పేరుతో ప్రకటించిన మూడు హామీలూ మహిళలకు తోడ్పాటునందించేవేనని గుర్తు చేస్తున్నారు. మహిళలను ఇంతగా ఆకర్షించే పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలేదని, దీంతో మహాలక్ష్మి పేరుతో ప్రకటించిన హామీలను మహిళలు ఆసక్తిగా గమనిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మొత్తం రైతాంగం టార్గెట్!
ఎన్నికల్లో రైతుల మద్దతు పొందేందుకు ఏ ఒక్కరినో కాకుండా.. అందరికీ ప్రయోజనం కలిగించేలా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం వల్లే రైతువర్గాల్లో బీఆర్‌ఎస్ పట్ల ఇప్పటికీ కొంత సానుకూలత ఉందన్న విశ్లేషణలున్నాయి. దీంతో ఆ సానుకూలతను బద్దలు కొట్టేలా.. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పేరుతో రైతాంగానికి గ్యారంటీ కార్డులో ఆకర్షణీయమైన హామీలను చేర్చింది. భూమి ఉన్న రైతులకు మాత్రమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం భూమి ఉన్న వారితోపాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని గ్యారెంటీ కార్డులో ప్రకటించింది. పైగా, ప్రస్తుతం రైతుబంధు సాయం ఎకరాకు రూ.10 వేలు ఉంటే.. తమ రైతు భరోసా హామీలో దానిని రూ.15 వేలకు పెంచింది. భూమి లేక, పెట్టుబడి పెట్టి కౌలు చేసేంత ఆర్థిక స్తోమత లేక.. వ్యవసాయ కూలీలుగా కొనసాగుతున్న వారికీ ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయడంపై హామీ ఇచ్చింది. మరోవైపు రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూనే.. మరింత గిట్టుబాటు అయ్యేలా క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు.
భూమి ఉన్న రైతులకేనన్న కేసీఆర్..
రైతాంగం అంటే.. అందులో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలుంటారు. వీరిలో కేవలం రైతులకు మాత్రమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తోంది. కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేది లేనేలేదంటూ సీఎం కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో పలుమార్లు ప్రకటించారని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. వాస్తవానికి సంఖ్యాపరంగా రైతుల కంటే కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులే ఎక్కువగా ఉంటారని, తమ పార్టీ ప్రకటించిన రైతు భరోసా గ్యారంటీతో వీరందరూ ప్రయోజనం పొందుతారని అంటున్నారు. రైతాంగంలో భాగమైన రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు తమ హామీలను ఆసక్తిగా గమనిస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా అటు మహాలక్ష్మి, ఇటు రైతు భరోసా పేరుతో ఇచ్చిన గ్యారంటీల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తోందని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇది మరింత పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.