ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపైనే వేటు!
ABN , First Publish Date - 2023-08-22T04:28:04+05:30 IST
వచ్చే ఎన్నికలకు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. టికెట్లు నిరాకరణలో ఎస్సీ, ఎస్టీ సిటింగ్ ఎమ్మెల్యేల పైనే ప్రధానంగా వేటు వేశారు.
‘రిజర్వుడ్’లో షాకిచ్చిన గులాబీ బాస్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): వచ్చే ఎన్నికలకు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. టికెట్లు నిరాకరణలో ఎస్సీ, ఎస్టీ సిటింగ్ ఎమ్మెల్యేల పైనే ప్రధానంగా వేటు వేశారు. టికెట్లు నిరాకరించిన ఏడుగురు సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు రిజర్వుడ్ స్థానాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. ఆసిఫాబాద్, బోఽథ్, ఖానాపూర్, వైరా నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడ్ కాగా, స్టేషన్ ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం. జనరల్ స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో టికెట్లు నిరాకరించిన వారిలో.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయక్ 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందారు. ఇప్పుడు వీరిద్దరినీ పక్కన పెట్టి కొత్త నేతలను బరిలో దింపాలని నిర్ణయించారు. ఇక ఆసిఫాబాద్‌లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన ఆత్రం సక్కుకూ చుక్కెదురైంది. మరోవైపు ఖమ్మం జిల్లా వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. బీఆర్‌ఎ్‌సలో చేరిన రాములునాయక్‌ను కూడా కేసీఆర్ పక్కన పెట్టారు. ఖమ్మం మాజీ ఎంపీ, ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా పేరున్నందునే రాములునాయక్ టికెట్ కోల్పోయారన్న ప్రచారం జరుగుతోంది. మిగిలిన ముగ్గురు ఎస్టీ ఎమ్మెల్యేలకు ముందునుంచి హెచ్చరికలు వస్తున్నా.. అప్రమత్తం కాకపోవడం, మారుతున్న రాజకీయ పరిస్థితులు, కింది స్థాయి నుంచి వస్తున్న వ్యతిరేకత, అసమ్మతికి అడ్డుకట్ట వేయకపోవడం వల్లే మరోసారి పోటీ చేసే అవకాశానికి దూరమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఆత్రం సక్కు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా 2023లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ.. ఆయన వెంట కాంగ్రెస్ క్యాడర్ రాకపోవడం, బీఆర్‌ఎస్ క్యాడర్ కూడా ఆయనతో అంటీముట్టనట్లు వ్యవహరించడం వల్లే పక్కన పెట్టాల్సివచ్చిందని చెబుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారని అంటున్నారు. కాగా, ఖానాపూర్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను పక్కనపెట్టి జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగైదు నెలల నుంచే నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనకే టికెట్ వస్తుందని జాన్సన్ నాయక్ ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అయితే స్థానికులను కాదని ఇతర జిల్లాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి అయిన కేటీఆర్‌కు సన్నిహితుడైన ఒకే ఒక కారణంతో జాన్సన్‌నాయక్‌కు అధిష్ఠానం మద్ధతుగా నిలిచిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య విషయంలో మొదటినుంచీ వ్యతిరేక ప్రచారం జరుగుతూనే ఉంది.